మెగాస్టార్ చిరంజీవికి కరోనా, టీఆర్ఎస్ వర్గాల్లో కలవరం

  • Published By: naveen ,Published On : November 9, 2020 / 02:40 PM IST
మెగాస్టార్ చిరంజీవికి కరోనా, టీఆర్ఎస్ వర్గాల్లో కలవరం

corona for chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి కరోనా బారిన పడటంతో సినీ ఇండస్ట్రీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. కరోనా వచ్చినట్లు స్వయంగా చిరంజీవి ట్వీట్ చేశారు. ఆచార్య షూటింగ్ సందర్భంగా కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే… తనకు పాజిటివ్ వచ్చిందని చిరు ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, తనకు ఎలాంటి లక్షణాలు లేవని చెప్పారు. ఇటీవలే వరద సాయం చెక్‌లు అందించడానికి నాగార్జునతో కలిసి… చిరంజీవి… తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిశారు.. గత నాలుగైదు రోజులుగా తనను కలిసి వాళ్లంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని చిరు సూచించారు. ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితిపై సమాచారం అందిస్తూనే ఉంటానని చిరు తెలిపారు.

సెలబ్రిటీలు, రాజకీయ నేతల్లో కలవరం:
మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకడం ఇప్పుడు పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నేతలను కలవరపెడుతోంది. ఇటీవలే వరద సాయం చెక్‌లు అందించడానికి నాగార్జునతో కలిసి చిరంజీవి, కేసీఆర్‌ను కలిశారు.. దీంతో ఇటు టీఆర్‌ఎస్‌ వర్గాలతో పాటు అటు నాగార్జున హోస్ట్‌ చేసే బిగ్‌బాస్‌ టీమ్‌లో కూడా కరోనా టెన్షన్‌ ప్రారంభమైందనే చెప్పాలి. వరద సాయం చెక్‌లు అందించే సమయంలో సీఎం కేసీఆర్‌తో పాటు ఎంపీ సంతోష్‌, చిరంజీవి, నాగార్జున ఇతర టీఆర్‌ఎస్‌ నేతలు ఎవ్వరూ కూడా మాస్క్‌లు ధరించలేదు. ఈ రోజు తనకు కరోనా వచ్చిందని చిరంజీవి చేసిన ప్రకటన వారికి షాక్‌ ఇచ్చిందనే చెప్పాలి.

నెగిటివ్ వచ్చిందన్న ఎంపీ సంతోష్:
ఇవాల్టి(నవంబర్ 9,2020) నుంచి కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య షూటింగ్‌ ప్రారంభమవ్వాల్సి ఉంది. దీని కోసమే చిరంజీవి కరోనా టెస్ట్‌ చేయించుకున్నారు. దీంతో ఆయనకు ఈ వైరస్‌ సోకినట్టు నిర్థారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. చిరంజీవి ఈ మధ్య పలువురు ప్రముఖులను కలవడంతో వాళ్లకు కూడా కరోనా ఏమైనా సోకిందా.. అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. చిరంజీవికి పాజిటివ్‌ రావడంతో కేసీఆర్‌, నాగార్జున పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో వారు ప్రకటించ లేదు. అయితే ఎంపీ సంతోష్ మాత్రం.. తాను పరీక్ష చేయించుకున్నానని, నెగెటివ్ రిజల్ట్ వచ్చిందని ప్రకటించారు.

RRR షూటింగ్‌పై ప్రభావం పడే అవకాశం:
టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవికి కరోనా సోకడం.. RRR షూటింగ్‌పై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. కరోనా కారణంగా నిలిచిపోయిన RRR షూటింగ్.. ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది.. ఇదిలా ఉంటే చిరంజీవిని మొన్న ఎంపీ సంతోష్‌ కలిశారు.. ఆ తర్వాత నిన్న చిరంజీవి, ఎంపీ సంతోష్‌తో కలిసి రామ్‌చరణ్‌ గ్రీన్‌ చాలెంజ్‌లో పాల్గొన్నారు. దీంతో.. రామ్‌చరణ్‌ కూడా టెస్టు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఐసోలేషన్‌కు వెళ్లాల్సి వస్తే RRR షూటింగ్‌పై ప్రభావం పడడం ఖాయం.

నాగ్ కు పాజిటివ్ వస్తే బిగ్ బాస్ పై ప్రభావం పడే చాన్స్:
ఇక్కడితో ఈ ముప్పు ముగిసిపోలేదు.. చిరంజీవితో కలిసి కేసీఆర్‌ను కలిసిన వారిలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున కూడా ఉన్నారు. ఈయన కూడా టెస్టు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెగెటివ్ వస్తే సంతోషం. ఒకవేళ పాజిటివ్ వస్తే మాత్రం బిగ్‌బాస్‌ ప్రోగ్రామ్‌పై ప్రభావం పడుతుంది. నాగార్జునకు వైరస్ సోకినట్లు తేలితే.. బిగ్‌బాస్ టీమ్‌ కూడా టెస్టులు చేయించుకోక తప్పదు. నాగార్జున వైల్డ్ డాగ్‌ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నాడు. దీనిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.

మామూలుగా కరోనా ఇంక్యూబేషన్‌ పీరియడ్‌ ఐదు నుంచి 14 రోజుల వరకు ఉంటుంది. ఒక వేళ కరోనా సోకినా ఈ విషయం బయటపడటానికి మినిమమ్‌ మూడు- నాలుగు రోజుల సమయం పడుతుంది. ఈ లెక్కన సీఎం కేసీఆర్‌, నాగార్జున, రామ్‌ చరణ్‌లకు కరోనా సోకిందా? లేదా అన్న విషయం తెలియాలంటే కనీసం ఐదు రోజులు ఆగాల్సిందే.