ఈ ఖాకీ గుండె ఎంత మంచిదో: గర్భిణి కోసం కారు ఇచ్చేసి!

  • Published By: vamsi ,Published On : March 26, 2020 / 02:11 AM IST
ఈ ఖాకీ గుండె ఎంత మంచిదో: గర్భిణి కోసం కారు ఇచ్చేసి!

ఖాకీ చొక్కా వేసుకుంటే చాలు.. మేమంతా సమాజానికి అతీతులం అన్నట్లుగా.. మేం ఏం చేసినా చెల్లిపోద్ది.. ఎవ్వరినైనా కర్ర ఇరిగేవరకు కొట్టేస్తాం.. వాతలు వచ్చేలా తాట తీస్తాం.. అనే పోలీసులనే మనం సమాజంలో ఎక్కువ చూస్తుంటాం కదా? అయితే కఠినమైన ఖాకీ దుస్తుల చాటున కరిగిపోయే మనస్సు కూడా ఉంది అంటూ అప్పుడప్పుడు కొందరు పోలీసులు మాత్రం చాలా బాధ్యతగా వ్యవహరిస్తుంటారు.

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తుండగా.. కంటికి క‌న‌ప‌డ‌ని శ‌త్రువైన వైర‌స్‌తో దేశం పోరాడుతుండగా.. లాక్‌డౌన్‌తో జనాలను ఇళ్లకు మాత్రమే పరిమితం చేసింది ప్రభుత్వం. ఈ క్రమంలో బయటకు రావడానికి ప్రజలు భయపడుతున్న పరిస్థితి. అత్యవసర పరిస్థితిలో వచ్చినా కూడా ప్రయాణ ఏర్పాట్లు లేవు. లేటెస్ట్‌గా ఈ క‌ష్ట స‌మ‌యంలో సికింద్రాబాద్ చిలకలగూడ పోలీసులు ఓ గ‌ర్భిణికి సాయం చేశారు పోలీసులు.

వారసిగూడ ప్రాంతం నుంచి చిలకలగూడ పోలీస్ స్టేషన్ వైపు వస్తున్న ఇన్‌స్పెక్టర్ కారుకు ఓ మహిళ అడ్డువచ్చింది. అది చూసిన ఇన్ స్పెక్టర్ బాల‌గంగిరెడ్డి వాహనం ఆపారు. ఆ మహిళ తన కోడలు పురిటి నొప్పులతో బాధ పడుతోంది. ఆస్ప‌త్రికి తీసుకెళ్లేందుకు ఏ వాహ‌నం దొర‌క‌డం లేద‌ని కంట‌త‌డి పెట్టుకోగా.. ఆ మ‌హిళ ఆవేద‌న విని పోలీసు వాహ‌నంలో నుంచి దిగి.. ఆ గ‌ర్భ‌వ‌తిని అందులో ఎక్కించి ఆసుపత్రికి పంపించారు. ఆమెను ఆస్ప‌త్రిలో దించి రావాల‌ని డ్రైవర్ ను ఆదేశించారు ఇన్ స్పెక్ట‌ర్. తాను దిగిపోయి తన కారులోనే ఆ మహిళలను స్ప్రింగ్ ఆస్పత్రికి స‌కాలం చేర్చారు బాల‌గంగిరెడ్డి.