ఫోని తుఫాన్ : తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు

  • Published By: madhu ,Published On : April 29, 2019 / 12:57 AM IST
ఫోని తుఫాన్ : తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు

నైరుతి రుతుపవనాల రాకకు ముందు బంగాళాఖాతంలో తొలి తుఫాను ఏర్పడింది. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి అది… తుఫానుగా బలపడింది. దీనికి బంగ్లాదేశ్‌ సూచించిన ప్రకారం ‘ఫోని’ అని నామకరణం చేశారు. 

ఈ తుఫాన్ తీవ్రత మే 2 వరకూ కొనసాగుతుందని వాతావరణశాఖ చెబుతోంది. ఏప్రిల్‌ 30న దిశను మార్చుకునే అవకాశాలున్నాయంటున్నారు అధికారులు. ఈశాన్య బంగాళాఖాతం వైపు మళ్లి.. కోస్తాంధ్ర వెంట పయనించి బంగ్లాదేశ్‌ వైపు వెళ్లే అవకాశం ఉంటుందంటున్నారు. ఫోని తుఫాన్‌కు తోడు దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, విదర్భ ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల రాగల మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి.

ఈ గాలుల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌ తీరంతో పాటు తమిళనాడు, పుదుచ్చేరిలపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. సముద్రం కల్లోల్లంగా ఉంటుందని.. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడతాయని, మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. అటు విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండో నెంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. 

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఏపీలో అధికారులు సిద్ధమయ్యారు. కోస్తా తీరంలో వెంబడి ఉన్న జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరీస్థితిని సమీక్షిస్తున్నారు. కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో విద్యుత్ సిబ్బందిని కూడా అలర్ట్ చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దించుతున్నారు.

అయితే… తుపాను పరిస్థితిపై ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం మధ్యాహ్నం నాటికి పూర్తి స్పష్టత వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు తీరప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. నెల్లూరు జిల్లా వాకాడు, ఇందుకూరుపేట, విడవలూరు, చిల్లకూరు, కావలి తదితర మండలాల్లోని తీర ప్రాంతాల్లో సముద్రం సుమారు 17 మీటర్ల వరకూ ముందుకొచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.