టి.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు : ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లు వీరే

  • Published By: madhu ,Published On : September 7, 2019 / 02:42 PM IST
టి.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు : ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లు వీరే

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సెప్టెంబర్ 09వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తూ బిజీగా ఉన్నాయి. సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో చీఫ్ విప్‌తో పాటు విప్‌లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. సెప్టెంబర్ 07వ తేదీ శనివారం సాయంత్రం పేర్లను ప్రకటించారు. ప్రభుత్వ చీఫ్ విప్‌గా దాస్యం వినయ్ భాస్కర్, విప్‌లుగా గొంగిడి సునీత, గంపా గోవర్ధన్, గువ్వల బాలరాజు, అరికెపూడి గాంధీ, రేగా కాంతారావు, బాల్క సుమన్‌లను నియమిస్తున్నట్లు వెల్లడించారు. 

సెప్టెంబర్ 09వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం..2019 ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2019-20 రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్‌ను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. సమావేశాలు ప్రారంభమైన రోజునే బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

శాసనసభలో సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. ఆర్థిక వ్యవహారాలు కూడా సీఎం చూస్తున్న సంగతి తెలిసిందే. శాసనమండలిలో సీఎం తరపున ఎవరైనా మంత్రి బడ్జెట్ ప్రసంగం చేసే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాల్లో కేటాయింపులపై ప్రభుత్వం, విపక్షాల మధ్య హాట్ హాట్ చర్చలు జరిగే ఛాన్స్ ఉంది. 
Read More : తమిళిసై ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు : రాజ్ భవన్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు