రేపిస్టుల నీడ పడకుండా.. దిశ నిందితుడు భార్య, బిడ్డకు సాయం చేయాలని వర్మ ట్వీట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్‌ దిశ కేసు నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య రేణుక గత రాత్రి పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

  • Published By: veegamteam ,Published On : March 7, 2020 / 07:37 AM IST
రేపిస్టుల నీడ పడకుండా.. దిశ నిందితుడు భార్య, బిడ్డకు సాయం చేయాలని వర్మ ట్వీట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్‌ దిశ కేసు నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య రేణుక గత రాత్రి పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్‌ దిశ కేసు నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య రేణుక శుక్రవారం(మార్చి 6,2020) రాత్రి పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై వివాదాస్పద సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. తోడు లేని వారిని ఆదుకోవాలని, ఆర్థిక సాయం చేయాలని వర్మ ట్విట్టర్‌ ద్వారా పిలుపునిచ్చారు. ”చెన్నకేశవులు భార్య రేణుక పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. రేపిస్టుల నీడ వారి భవిష్యత్తుపై పడకుండా ఉండాలంటే.. దయచేసి ఎవరికి తోచిన ఆర్థిక సాయం వారు చేయండి” అని ఆర్జీవీ ట్వీట్‌ చేశారు.

యాక్షన్‌ ఎయిడ్‌ ఫర్‌ సోసైటల్‌ అడ్వాన్స్‌మెంట్‌ (ఏఏఎస్‌ఏ) అకౌంట్‌ నెంబర్‌తో(918010050607980) పాటు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌(UTIB0001454) కూడా తన ట్వీట్‌లో చేర్చారు వర్మ. ప్రస్తుతం దిశ ఘటనపై సినిమా చేసేందుకు ఆర్జీవి సన్నాహాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు.. నిందితుల కుటుంబాల గురించి తెలుసుకోవడానికి నిందితుడు చెన్నకేశవులు భార్య రేణుకను ఇటీవలే కలిశాడు వర్మ. పలువురు పోలీసు అధికారులను కూడా కలిసి వివరాలు సేకరించాడు.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగే నాటికి చెన్నకేశవులు భార్య రేణుక గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ సమీపంలో 2019, నవంబర్ 27న వెటర్నరీ డాక్టర్ దిశపై నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను సజీవంగా తగులబెట్టారు. ఈ దారుణం యావత్ దేశాన్ని కుదిపేసింది. ఆ నలుగురిని ఎన్ కౌంటర్ చేయాలని, బహిరంగంగా ఉరి తియ్యాలని డిమాండ్లు వినిపించాయి. దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలతో హోరెత్తించారు.(దిశ’ కేసులో ఎన్‌కౌంటర్ అయిన చెన్నకేశవులకు ఆడపిల్ల పుట్టింది)

ఈ క్రమంలో సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌లో భాగంగా పోలీసులు నిందితులను 2019 డిసెంబర్ 6న ఘటనా స్థలికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించారని, తమపై దాడి చేశారని, దీంతో ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని, కాల్పుల్లో నలుగురూ చనిపోయారని పోలీసులు తెలిపారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ కూడా సంచలనం రేపింది. దీనిపై ఓవైపు నుంచి హర్షం వ్యక్తం కాగా, మరోవైపు నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.  దిశ అత్యాచారం, హత్య, నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసుకు సంబంధించిన ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఎన్ కౌంటర్ పై కేసు నమోదు కావడంతో అంత్యక్రియలు 17 రోజులు ఆలస్యమయ్యాయి. డిసెంబర్ 6న ఎన్‌కౌంటర్ జరిగితే.. డిసెంబర్ 23న నిందితుల అంత్యక్రియలు నిర్వహించారు.