హైదరాబాద్‌లో మెట్రో రైల్ సర్వీసుల ప్రారంభంపై నీలినీడలు, సెప్టెంబర్ 7 నుంచి డౌటే, కారణాలు ఇవే

  • Published By: naveen ,Published On : August 30, 2020 / 11:38 AM IST
హైదరాబాద్‌లో మెట్రో రైల్ సర్వీసుల ప్రారంభంపై నీలినీడలు, సెప్టెంబర్ 7 నుంచి డౌటే, కారణాలు ఇవే

అన్ లాక్ 4 లో భాగంగా సెప్టెంబర్ 7వ తేదీ నుంచి మెట్రో రైలు సర్వీసులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిబంధనలకు అనుగుణంగా మెట్రో రైళ్లను దశల వారిగా అన్ని రూట్లలో తిప్పుకోవచ్చని చెప్పింది. మరి హైదరాబాద్ లో మెట్రో సేవలు సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం అవుతాయా? సుదీర్ఘ విరామం తర్వాత మెట్రో రైలు పట్టాలపై పరుగులు పెట్టనుందా? ఇప్పుడీ ప్రశ్నలు నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

మెట్రో సర్వీసులకు గ్రీన్ సిగ్నల్:
కేంద్రం శనివారం(ఆగస్టు 29,2020) అన్ లాక్ 4 మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో కీలక రంగాలకు మినహాయింపులు ఇచ్చిన కేంద్రం, మెట్రో రైల్ సేవల ప్రారంభానికి కూడా అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 7 నుంచి మెట్రో సేవలు పున ప్రారంభించుకోవాలని అన్ లాక్ 4 మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ సేవలు పునరుద్ధరించాలంది. కంటైన్ మెంట్ జోన్ల వెలుపలే సేవలు ప్రారంభించాలంది. దీంతో దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైళ్లు ప్రజలకు మళ్లీ సేవలు అందించనున్నాయి. దాదాపు 160 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత మెట్రో సేవలు మళ్లీ ప్రారంభం కానున్నాయి.

హైదరాబాద్ లో మెట్రో సేవల ప్రారంభంపై సందేహాలు:
మెట్రో రైల్ సేవల పునురద్దరణకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే పలు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. ఇప్పుడు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో మెట్రో సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో మెట్రో రైలు సేవలు పునరుద్దరించడానికి కసరత్తు చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ లోనూ మెట్రో సర్వీసులు స్టార్ట్ చేయనున్నారు. మరి మన హైదరాబాద్ సంగతి ఏంటి? హైదరాబాద్ నగరంలో మెట్రో సేవలు తిరిగి ప్రారంభం అవుతాయా? అనే ప్రశ్నలకు సమాధానం లేదు. హైదరాబాద్ నగరంలో మెట్రో సేవలపై సందేహాలు నెలకొన్నాయి.

కంటైన్ మెంట్ జోన్లు, సీటింగ్ అరెంజ్ మెంట్:
సెప్టెంబర్ 7 నుంచి హైదరాబాద్ లో మెట్రో సేవల పునరుద్దరణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. మెట్రో సేవలు ప్రారంభం కాకపోవచ్చు అని చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి కంటైన్ మెంట్ జోన్లు.

* మెట్రో రైళ్లు నడిచే మార్గంలో పలు కంటైన్ మెంట్ జోన్లు ఉన్నాయి.
* అంతేకాదు మెట్రో రైళ్లలో 50శాతం మందికే సీటింగ్ కెపాసిటీ ఇవ్వాల్సి ఉంటుంది.
* ప్రయాణికులు అంతా భౌతిక దూరం పాటించేలా చూడాలి.
* ఇందుకోసం సీటింగ్ అరేంజ్ మెంట్ చేయాల్సి ఉంది.
* హైదరాబాద్ మెట్రో అధికారులు ఇంకా దీనిపై దృష్టి సారించనట్టుగా తెలుస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తుందా?
మెట్రో సర్వీసులు ప్రారంభించడానికి కేంద్రం అనుమతి ఇచ్చినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే బస్సు సర్వీసులకు కేంద్రం అనుమతి ఇచ్చినా తెలంగాణలో బస్సు రవాణా ఇంకా పూర్తి స్తాయిలో అందుబాటులోకి రాలేదు. మారుమూల ప్రాంతాలకు బస్సులు తిరిగేందుకు ప్రభుత్వం అనుమతించ లేదు. అంతేకాదు జీహెచ్ఎంసీలో సిటీ బస్సులకు రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. కంటైన్ మెంట్ జోన్లు, కోవిడ్ నిబంధనలు తదితర కారణాల నేపథ్యంలో సిటీ బస్సులకు అనుమతించే అంశంపై జాప్యం జరుగుతోంది. ఇవే కారణాలతో మెట్రో సర్వీసులకు అనుమతించే విషయంలోనూ మరికొంత కాలం సమయం పట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మెట్రో కార్పొరేషన్ ఎండీలతో కేంద్రం సమావేశం:
సెప్టెంబర్ 1న మెట్రో కార్పొరేషన్ ఎండీలతో కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమావేశం నిర్వహించనుంది. మెట్రో కార్పొరేషన్ అధికారులతో చర్చలు జరపనుంది. అనంతరం మెట్రో రైళ్ల పని తీరుపై నియమ నిబంధనలు ప్రకటించనుంది. దీనికి హైదరాబాద్ మెట్రో ఎండీ కూడా హాజరు కానున్నారు. మెట్రో అధికారులు కూడా ఓ సమావేశం ఏర్పాటు చేసి మెట్రో సేవల పునరుద్దరణపై ఓ నిర్ణయానికి రానున్నారు. అనంతరం తమ నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తారు. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే అనుకున్న సమయానికి హైదరాబాద్ నగరవాసులకు మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి. లేకుంటే మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది.