ఇదేం పిచ్చి.. ఫొటోల కన్నా ప్రాణం ముఖ్యం.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదకరంగా ఫొటోలు, సెల్ఫీలు

  • Published By: naveen ,Published On : October 2, 2020 / 11:45 AM IST
ఇదేం పిచ్చి.. ఫొటోల కన్నా ప్రాణం ముఖ్యం.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదకరంగా ఫొటోలు, సెల్ఫీలు

Durgam Cheruvu Cable Bridge: దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి దగ్గర సందర్శకుల పర్యటన ప్రమాదకరంగా మారుతోంది. ట్రాఫిక్‌ను లెక్క చేయకుండా.. బ్రిడ్జి మీద ప్రమాదకరంగా కొందరు ఫోటోలు దిగుతున్నారు. కొందరి ఉత్సాహం అటు వాహనదారులకు తలనొప్పిగా.. ఇటు సందర్శకుల ప్రాణాల మీదికి తెస్తోంది.

కొత్తగా నిర్మించిన బ్రిడ్జి దగ్గర ఫోటోలు దిగాలనే అత్యుత్సాహం పలువురిని ఇబ్బంది పెడుతోంది. రోడ్డుకు అడ్డంగా నిలబడి రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్నారు. ఇక వీకెండ్స్‌లో సందర్శకుల తాకిడి మరింత పెరుగుతోంది. దీంతో ఇప్పటికే కేబుల్ బ్రిడ్జి మీద.. సోమవారం నుంచి శుక్రవారం వరకు వాహనాలు ఆగడంపై నిషేధాన్ని విధించారు.

నగరంలోని దుర్గం చెరువుపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తీగల వంతెనకు సందర్శకుల తాకిడి పెరుగుతోంది. సెప్టెంబర్ 25న మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా తీగల వంతెన ప్రారంభమైంది. లాక్‌డౌన్‌ కాలంలో ఇంటికే పరిమితమైన చాలామందికి దుర్గంచెరువు మంచి పర్యటక కేంద్రంగా మారింది. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున సందర్శిస్తోంది. సాయంత్రం వేళ లైటింగ్స్‌ బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. దీంతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఫోటోలు దిగేందుకు అంతా పోటీపడుతున్నారు.

అయితే వంతెన ప్రారంభయయ్యాక వాహనాలు సైతం పెద్ద ఎత్తున వంతెన మీదుగా వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే పర్యాటకుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వంతెనపై వాహనాలు వేగంగా వేళ్తున్నా ఏ మాత్రం లెక్కచేయకుండా ఫోటోలకు ఎగబడుతున్నారు. రోడ్డుపై వస్తున్న వాహనాలు ఏమాత్రం లెక్క చేయకుండా సెల్పీలు దిగుతున్నారు. మరీ ముఖ్యంగా వీకెండ్ లో సందర్శకుల తాకిడి విపరీతంగా పెరుగుతోంది. రోడ్డుకు అడ్డంగా నిలబడి రాకపోకలకు ఆటంకం కలిగిస్తుండటంతో సెల్పీ స్పాట్‌ ప్రమాదకరంగా మారింది.

దీనిపై దృష్టిసారించిన జీహెచ్‌ఎంసీ అధికారులు వాహనాలు వంతెనపై నిలపకుండా నిషేదం విధించారు. ఫోటోల కోసం వంతెనపై ఆగితే భారీగా ఫైన్లు విధిస్తున్నారు. అయినప్పటికీ తీరు మారకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో శని, ఆదివారాల్లో వాహనాలను అనుమతించకూడదని సైబరాబాద్‌ పోలీసులు నిర్ణయించారు. వీకెండ్స్‌లో అధిక సంఖ్యలో సందర్శకులు వస్తున్నందున ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.



కేబుల్ బ్రిడ్జిపైకి సందర్శకులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్, ఇతర సమస్యలు రాకుండా వీకెండ్స్ లో వాహనాలను అనుమతించకపోవడమే సరైందని పోలీసులు అభిప్రాయపడ్డారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి తిరిగి సోమవారం ఉదయం 6 గంటల వరకు దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిపైకి వాహనాలను అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఆ బ్రిడ్జిపైకి ఐటీసీ కోహినూర్‌తో పాటు జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌ 45 వైపు నుంచి వాహనాలతో సందర్శకులు వస్తున్నందున ఇరువైపులా పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయాలని సీపీ సూచించారు. దీంతో వీకెండ్ లో పర్యటకులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సీపీ తెలిపారు.

సెల్ఫీలు, ఫొటోలు దిగి ఆనందించడం సరే.. అదే సమయంలో దూసుకొస్తున్న వాహనాలతో కేర్ ఫుల్ గా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. చీకటి పడగానే విద్యుత్ కాంతులతో మెరిసిపోయే కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు జనం తాకిడి ఎక్కువగా ఉంటోంది. దీంతో వాహనాల పార్కింగ్ సమస్య ఏర్పడింది. మరోవైపు, వాహనాలు దూసుకొస్తున్నా లెక్క చేయకుండా జనాలు సెల్ఫీలు, ఫొటోలు దిగే మోజులో పడిపోతున్నారు. వాటి మోజులో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం అని అధికారులు, పోలీసులు నెత్తీనోరు బాదుకుని చెబుతున్నా జనాల్లో మార్పు రావడం లేదు.