ఎన్నికల ఖర్చు చెప్పాల్సిందే : లేకపోతే అనర్హత వేటు

హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేసిన వారంతా తమ ఖర్చుకు సంబంధించిన లెక్కలు సమర్పించాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) శనివారం ఆదేశించింది. నామినేషన్లు దాఖలు చేసిన వారంతా గెలుపోటములు, విరమణ, ఏకగ్రీవ ఎన్నిక వంటి వాటితో సంబంధం లేకుండా తాము చేసిన ఖర్చుకు సంబంధించిన వివరాలు 45 రోజుల నిర్ణీత గడువులోగా చూపించాలని ఆదేశించింది. లెక్కలు చూపకపోతే ఆ అభ్యర్థులు పంచాయతీరాజ్ ఎన్నికల్లో మూడేళ్లపాటు పోటీ చేయకుండా అనర్హత వేటు వేస్తారు. గెలుపొందిన వారి విషయానికొస్తే వారు తమ స్థానాన్ని కోల్పోవడంతో పాటు మూడేళ్లపాటు పోటీచేయకుండా అనర్హులుగా ప్రకటిస్తారు.
2019 జనవరి లో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 21, 25, 30 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఫలితాలు కూడా ప్రకటించారు. ఈ మూడు విడతల్లో ఫలితాలు వెలువడిన రోజు నుంచి 45 రోజుల్లోగా నామినేషన్లు సమర్పించిన వారంతా ఎన్నికల్లో తాము చేసిన ఖర్చు పై తుది రిటర్న్స్‌ను సంబంధిత ఎంపీడీవో కి సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అభ్యర్థులు ఇచ్చిన ఎన్నికల ఖర్చు వివరాలను ఎంపీడీవోలు తమ కార్యాలయంలోని నోటీస్ బోర్డులో ప్రదర్శించాలి. అభ్యర్థులు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన వివరాలు ఎవరైనా తెలుసుకోవాలంటే, జిరాక్స్ ఖర్చులను చెల్లించడం ద్వారా ఎంపీడీవో కార్యాలయం నుంచి ఆ వివరాలు పొందవచ్చు. అభ్యర్థుల ఖర్చుపై, వారు సమర్పించిన రిటర్న్స్‌పై అభ్యంతరాలుంటే, సరైన ఆధారాలతో జిల్లాల పర్యటనకు వ్యయ పరిశీలకులు వచ్చినపుడు వారి దృష్టికి తీసుకురావచ్చు అని ఎన్నికల సంఘం తెలిపింది.
మొదటి విడతలో పోటీ చేసిన అభ్యర్ధులు మార్చి 6లోగా రిటర్న్స్ దాఖలు చేయాలని ఎస్‌ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ తెలిపారు. రెండో విడతకు సంబంధించి ఈనెల 10లోగా, మూడో విడతకు సంబంధించి ఈనెల 15లోగా నామినేషన్ దాఖలు చేసిన వారంతా లెక్కలు సమర్పించాలని సూచించారు.