ఈఎస్ఐ కుంభకోణం : ఫార్మాసిస్టు నాగ లక్ష్మీ అరెస్టు

  • Published By: madhu ,Published On : October 7, 2019 / 02:03 AM IST
ఈఎస్ఐ కుంభకోణం : ఫార్మాసిస్టు నాగ లక్ష్మీ అరెస్టు

ఈఎస్‌ఐ కుంభకోణంలో మరొకరిని ఏసీబీ అరెస్ట్‌ చేసింది. ఫార్మా కంపెనీ ఎండీ సుధాకర్‌రెడ్డితో కలిసి అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలతో సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ఫార్మాసిస్ట్‌గా పని చేస్తున్న నాగలక్ష్మీని అరెస్ట్‌ చేశారు. దేవికారాణికి కీలకమైన వ్యక్తిగా భావిస్తున్నారు. ఇండెంట్లను ట్యాంపరింగ్ చేయడంలో ఈమె దిట్ట. 

ఎనిమిదిన్నర కోట్ల రూపాయల మందుల కొనుగోలు వ్యవహారంలో ఆమె పాత్ర ఉందని తెలుస్తోంది. ఫార్మా కంపెనీ ఎండీ సుధాకర్‌, నాగలక్ష్మీ కలిసి పెద్దమొత్తంలో అక్రమాలకు చేసినట్లుగా ఏసీబీ గుర్తించింది. ఈమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో ఇప్పటి వరకూ ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్టయిన వారి సంఖ్య 10కి చేరింది. రాష్ట్రంలోని వివిధ డిస్పెన్సరీల నుంచి గత నాలుగేళ్లుగా వెళ్లిన మందులను ఏసీబీ పరిశీలించింది. పలుచోట్ల మార్చిన అంకెలను, మార్చిన ఇంకుల్లో వ్యత్యాసాలను అధికారులు పట్టుకోగలిగారు.

ఇలా పెంచిన బిల్లులను దేవికా రాణికి పంపడం, వాటికి ఆమోదం రావడం..ఫార్మా కంపెనీకి చెల్లింపులు..వీరికి కమిషన్ రావడం..ఇలా అన్నీ చకచకా జరిగిపోయేవి. నాగలక్ష్మీ అక్రమమార్గంలో సంపాదించిన డబ్బులతో రూ. 50 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టినలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. లైఫ్‌ కేర్‌ డ్రగ్స్‌ ఎండీ సుధాకర్‌రెడ్డిని అవినీతి ఆరోపణలతో పాటు కుంభకోణంలో ఇతరులతో కుమ్మక్కయ్యారనే అభియోగాలతో ఏసీబీ అరెస్ట్‌ చేసింది. డైరెక్టర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, ఇతర అధికారులతో కలిసి కుట్ర పన్ని తమ సంస్థకు 8.25 కోట్ల మందుల కొనుగోలు ఆర్డర్‌ను సుధాకర్‌రెడ్డి సంపాదించారని ఏసీబీ తెలిపింది.

మరోవైపు ఈఎస్‌ఐ ఐఎంఎస్‌ కేసులో ఏసీబీ అధికారులు సోదాలు కూడా కొనసాగిస్తున్నారు. ఈ స్కామ్‌తో బాలానగర్‌లోని వెంకటేశ్వర హెల్త్‌ సెంటర్ యజమాని అరవింద్‌రెడ్డికి కూడా సంబంధముందని గుర్తించిన అధికారులు… సుచిత్ర ప్రాంతంలోని ఆయన నివాసంలో తనిఖీలు చేశారు. జాయింట్‌ డైరెక్టర్ పద్మతో కలిసి ఇతను ఈ కుంభకోణానికి పాల్పడ్డాడని… హెల్త్‌ క్యాంపుల పేరుతో మందులను అరవింద్‌రెడ్డి కంపెనీలకు తరలించి బ్లాక్‌లో అమ్ముకున్నారని గుర్తించారు. అరవింద్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న అధికారులు… అతడికి బాలానగర్‌, దూలపల్లిలో 3 కంపెనీలున్నట్లు గుర్తించారు. హెల్త్‌ క్యాంప్‌ల నుంచి అరవింద్‌రెడ్డి కంపెనీలకు చేరిన మందులు, పరికరాలపై లోతుగా దర్యాప్తు జరుపుతామని ఏసీబీ అధికారులు చెప్పారు.
Read More : ఆర్టీసీ సమ్మె ఉధృతం : ఇందిరాపార్కు వద్ద ధర్నా..ఫర్మిషన్ ఇవ్వని పోలీసులు