బీజేపీలో చేరిన మోత్కుపల్లి నరసింహులు

  • Published By: chvmurthy ,Published On : January 7, 2020 / 12:51 PM IST
బీజేపీలో చేరిన మోత్కుపల్లి నరసింహులు

మాజీ మంత్రి సీనియర్  నేత మోత్కుపల్లి నరసింహులు బీజేపీలో చేరారు.  పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈరోజు ఆయన ఢిల్లీలో పార్టీ కండువా కప్పుకుని కమలతీర్ధం పుచ్చుకున్నారు. మోత్కుపల్లికి పార్టీ కండువా కప్పి సభ్యత్వం ఇచ్చి జెపీ నడ్డా పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీలు సుజనా చౌదరి, గరికపాటిమోహనరావుతో కలిసి ఆయన భేటీ అయ్యారు. 

ఈసందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ …తెలంగాణలో బీజేపీ  ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మారుతోందని చెప్పారు. మోత్కుపల్లి రాక పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని ఆయన తెలిపారు. తెలంగాణలో ప్రఖ్యాతి గాంచిన సమ్మక్క-సారక్క జాతరను జాతీయ పండగగా ప్రకటించాలని కోరుతూ పలువురు కేంద్ర మంత్రులను కలిసినట్లు లక్ష్మణ్ చెప్పారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కలిసి కంటోన్మెంట్ సమస్యలపై  వినతి పత్రం ఇచ్చినట్లు లక్ష్మణ్ తెలిపారు.

lakshman with rajnath singh

టీడీపీ హయాంలో మంత్రిగా

టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి రాష్ట్ర విభజన అనంతరం అధినేత చంద్రబాబుతో విభేదించారు. 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని ఎన్‌టీఆర్‌ ఘాట్‌ వద్ద సంచలన ప్రకటన చేసి టీడీపీ నుంచి బహిష్కృతుడయ్యారు. చాలా రోజుల క్రితమే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నప్పటికీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చి నేటికి సాకారమైంది.

Also Read : మున్సిపోల్స్ కి లైన్ క్లియర్ : పిటీషన్లు కొట్టేసిన హై కోర్టు
ఎన్‌టీఆర్‌ మంత్రి వర్గంలో గనులు, విద్యుత్, సాంఘిక సంక్షేమం, టూరిజం శాఖ మంత్రిగా మోత్కుపల్లి పని చేశారు. 1982లో ఎన్‌టీఆర్‌ నూతనంగా స్థాపించిన తెలుగుదేశం పార్టీలో విద్యార్థి దశలోనే చేరారు. 1983లో జరిగిన ఎన్నికల్లో ఆయన తొలిసారిగా ఆలేరు నుంచి టీడీపీ శాసనసభ్యునిగా గెలుపొందారు. 1985లో టీడీపీ నుంచి, 1989లో ఇండిపెండెంట్‌గా, 1994 టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందా రు. 1999లో కాంగ్రెస్‌నుంచి ఆలేరులో గెలుపొందిన ఆయన 2004 టీడీపీ తరఫున ఆలేరులోనే ఓటమిపాలయ్యారు. 

 

2008లో జరిగిన ఉపఎన్నికల్లోనూ పోటీచేసి ఓడిపోయారు. 2009లో తుంగతుర్తి నియోజకవర్గంలో టీడీ పీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2014 లో ఖమ్మం జిల్లా మధిరలో పోటీ చేసి ఓటమి చెందాడు. 2018లో బీఎల్‌ఎఫ్‌ తరఫున ఆలే రు నుంచి పోటీ చేసి మరోసారి పరాజయంపాలయ్యాడు. 1991లో నంద్యాల లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికలో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావుపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు.  టీడీపీ నుంచి బహిష్కరణ అ నంతరం ప్రజావేదిక ఏర్పాటు చేసి 2018 ముందస్తు ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్‌ మద్దతుతో ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగారు.