WE LOVE KCR : మంత్రికి రూ.5వేలు జరిమానా

  • Published By: veegamteam ,Published On : February 15, 2020 / 01:16 PM IST
WE LOVE KCR : మంత్రికి రూ.5వేలు జరిమానా

రూల్ ఈజ్ రూల్. అది కామన్ మ్యాన్ అయినా.. సెలబ్రిటీ అయినా.. పొలిటీషీయన్ అయినా.. పవర్ లో ఉన్నా.. అందరూ సమానమే. రూల్ ఎవరు బ్రేక్ చేసినా చర్యలు తప్పవు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ విషయంలో ఇదే జరిగింది. అనుమతి లేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినందుకు జీహెచ్ఎంసీ.. మంత్రి తలసానికి జరిమానా విధించింది. రూ.5వేలు చెల్లించాలని నోటీసులు పంపింది. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు. దీంతో ‘వియ్ లవ్ యూ కేసీఆర్’ అంటూ మంత్రి తలసాని పేరుతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా, నిబంధనలకు విరుద్ధంగా వీటిని ఏర్పాటు చేశారని జీహెచ్‌ఎంసీ అధికారులు సీరియస్ అయ్యారు. మంత్రికి ఫైన్ విధించారు. 

సీఎం కేసీఆర్ బర్త్‌ డే నేపథ్యంలో ఓ భారీ హోర్డింగ్‌ను రూపొందించి ఐమాక్స్ సమీపంలోని కూడలి దగ్గర జీహెచ్ఎంసీ పర్యవేక్షణలో ఉన్న పార్కులో ఏర్పాటు చేశారు. మొక్కలు నాటాలంటూ పిలుపునిచ్చిన ఈ హోర్డింగ్ చివరన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరుంది. అందరిని విశేషంగా ఆకర్షించిన ఈ హోర్డింగ్.. జీహెచ్ఎంసీ అధికారులకు మాత్రం కోపం తెప్పించింది.

పుట్టిన రోజు తదితర సందర్భాల్లో హైదరాబాద్ నగర రహదారుల వెంట అనుమతి లేకుండా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌తో పాటు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇప్పటికే పలుమార్లు అధికారులకు స్పష్టం చేశారు. వీరి ఆదేశాలతో గతంలో పలువురు నేతలకు జరిమానా విధించారు. తాజాగా తలసానికి ఫైన్ పడింది. కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా కటౌట్ ఏర్పాటు చేస్తే.. సాక్షాత్తూ ఆయన కేబినెట్ మంత్రిపైనే జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకోవడం చర్చకు దారితీసింది. జీహెచ్ఎంసీ అధికారుల తీరుని కొందరు అభినందించారు. రూల్ ఈజ్ రూల్ అన్నారు. ఎలాంటి వివక్ష చూపకుండా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం అభినందించాల్సిన విషయమే అంటున్నారు. నిబంధనల విషయంలో పక్షపాత ధోరణి ఉండకూడదన్నారు. ఇది మంచి పరిణామం అని కామెంట్ చేశారు.