మంచు కష్టాలు

  • Published By: veegamteam ,Published On : January 13, 2019 / 02:03 AM IST
మంచు కష్టాలు

హైదరాబాద్: వెన్నులో వణుకుపుట్టించే చలికి ఇప్పుడు పొగమంచు తోడైంది. దట్టమైన పొగమంచు నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సంక్రాంతి పండక్కి సొంతూళ్లకి వెళుతున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు కప్పేయడంతో ఎదురుగా ఉన్న దారులు కనిపించని పరిస్థితి. అర్ధరాత్రి నుంచి ఉదయం 8 గంటలు దాటినా ఇదే దుస్థితి. 50 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలనూ గుర్తించలేక ప్రమాదాలు జరుగుతున్నాయి. 2019, జనవరి 12వ తేదీ శనివారం తెల్లవారుజామున పొగమంచు కారణంగా రంగారెడ్డి జిల్లా నందిగామ వద్ద బెంగళూరు హైవేపై  ఒకేసారి 16 వాహనాలు ఢీకొన్నాయి. ఉదయం 9 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నెమ్మదిగా కదిలింది. లైట్లు వేసుకున్నా.. దారి కనపడక కొన్ని వాహనాలు ఒకదాన్ని మరొకటి ఢీకొట్టడంతో స్పల్పంగా దెబ్బతిన్నాయి.

దట్టమైన పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముందు దారుందో.. వాహనం ఆగి ఉందో తెలియక అవస్థలు పడుతున్నారు. 10 అడుగుల దూరంలో ఏముందో అర్థంకాని దుస్థితి నెలకొంది. నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతంలోని హైదరాబాద్‌, విజయవాడ నేషనల్ హైవే(NH 65), అబ్దుల్లాపూర్‌మెట్‌, ఘట్‌కేసర్‌ మార్గంతోపాటు పరిసర గ్రామాల్లో 2019, జనవరి 12వ తేదీ శనివారం ఉదయం 9 గంటల వరకు మంచు కురిసింది. కశ్మీర్‌ను తలపించేలా మంచు ముంచెత్తడంతో సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు పయనమైన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మంచు ఇలానే మరో మూడురోజుల పాటు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారి తెలిపారు. పగలూ, రాత్రి సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నగరంలో 2019, జనవరి 12వ తేదీ శనివారం తెల్లవారుజామున కనిష్ఠ ఉష్ణోగ్రత 17 డిగ్రీలుగా నమోదైంది. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ ఎక్కువ. దీంతో చలి పెద్దగా లేకపోయినా మంచు మాత్రం విపరీతంగా కురుస్తోంది.

సాధారణంగా ఉత్తరాది నుంచి పొడి గాలులు వీస్తుంటే ఉష్ణోగ్రతలు పడిపోయి చలి వణికిస్తుంది. గాలి దిశ మారడంతో వాతావరణంలోనూ మార్పులు వస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఆగ్నేయ, తూర్పు దిశ, బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమ గాలులతో మంచు కురుస్తోందని వివరించారు.