GHMC కొత్త యాప్ : పేదల ఆకలి తీర్చేందుకు ఫీడ్ ది నీడ్ 

GHMC కొత్త యాప్ : పేదల ఆకలి తీర్చేందుకు ఫీడ్ ది నీడ్ 

హైదరాబాద్ : పేదలకు కడుపునిండా అన్నం పెట్టాలనే మహోన్నత లక్ష్యంతో ‘ఫీడ్ ద నీడ్’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. ఫీడ్ ద నీడ్ కార్యక్రమాన్ని హోటళ్లు, ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో హైదరాబాద్ నగరమంతా విస్తరించనున్నట్లు చెప్పారు.

ఫీడ్ ద నీడ్‌పై సోమవారం (ఫిబ్రవరి 11)GHMC  ప్రధాన కార్యాలయంలో హోటళ్లు, ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు, స్వచ్ఛంద సంస్థలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, అన్నదానం చేసేవారు, ఆకలితో ఉన్నవారికి మధ్య GHMC  అనుసంధానకర్తగా వ్యవహరిస్తుందని చెప్పారు.

కమిషనర్ దానకిశోర్ మాట్లాడుతూ.. పండుగలతో పాటు గాంధీ జయంతి, రిపబ్లిక్ డే వేడుకల్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు, ఇందులో భాగంగా మొదటి కార్యక్రమం ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్భంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. దీని కోసం ఓ మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నామనీ..ఫుడ్ ఇవ్వాలనుకునేవారు ఈ యాప్‌ ద్వారా తెలియజేస్తే ఎక్కడ అవసరమో అక్కడికి తామే స్వచ్ఛంద సంస్థల సహకారంతో చేరవేస్తామని చెప్పారు.

ఈపీటీఆర్‌ఐ ఎండీ కల్యాణ్ మాట్లాడుతూ, ఒక కిలో ఆహార పదార్థాలు ఉత్పత్తి చేసేందుకు 2500 లీటర్ల నీరు అవసరమవుతుందని, దీంతోపాటు పెట్టుబడి, రైతులు ఎంతో శ్రమ పడాల్సి ఉంటుందని చెప్పారు. దీన్ని గుర్తించి ఆహారాన్ని ఎవ్వరూ పడేయకుండా అవసరమైనవారికి అందించాలని కోరారు.