అద్భుత ప్రయోగం : హైదరాబాద్ లో ఇంకుడు రోడ్లు

హైదరాబాద్‌లో చినుకు పడితే చాలు.. రోడ్లన్నీ జలమయమవుతాయి. కాంక్రీట్‌ జంగిల్‌లో బొట్టు నీరు కూడా భూమిలోకి ఇంకదు. దీంతో ట్రాఫిక్‌ ఇక్కట్లు.. పాదచారుల అవస్థలు

  • Published By: veegamteam ,Published On : September 21, 2019 / 08:13 AM IST
అద్భుత ప్రయోగం : హైదరాబాద్ లో ఇంకుడు రోడ్లు

హైదరాబాద్‌లో చినుకు పడితే చాలు.. రోడ్లన్నీ జలమయమవుతాయి. కాంక్రీట్‌ జంగిల్‌లో బొట్టు నీరు కూడా భూమిలోకి ఇంకదు. దీంతో ట్రాఫిక్‌ ఇక్కట్లు.. పాదచారుల అవస్థలు

హైదరాబాద్‌లో చినుకు పడితే చాలు.. రోడ్లన్నీ జలమయమవుతాయి. కాంక్రీట్‌ జంగిల్‌లో బొట్టు నీరు కూడా భూమిలోకి ఇంకదు. దీంతో ట్రాఫిక్‌ ఇక్కట్లు.. పాదచారుల అవస్థలు మామూలుగా ఉండవు. నగరంలోని ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం అవసరమే. రోడ్డు విస్తరణ పేరుతో రోడ్డుకి ఇరువైపులా ఉన్న చిన్నపాటి మట్టి రోడ్డుని కూడా తారు రోడ్డుగా మారుస్తున్నారు. నగరంలోని ప్రధాన రహదారులతో పాటు శివారులోని చిన్న కాలనీల్లో కూడా ఇదే విధానాన్ని చేపడుతున్నారు. దీంతో వర్షపు నీరు భూమిలో ఇంకే పరిస్థితి ఉండదు. ఇదే కొనసాగితే భూగర్భ జలాలు అగుడంటిపోయే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయితే ఈ సమస్యకు కొత్త నిర్వచనం చెబుతున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు. వాన నీరు ఇంకిపోయే పర్మియబుల్‌ రోడ్డు నిర్మాణం చేపట్టారు. పర్మియబుల్ రోడ్డు అంటే.. ఇంకుడు రోడ్డు అని చెప్పుకోవచ్చు.
పైలెట్ ప్రాజెక్టుగా ఓల్డ్‌ సిటీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఆరు మీటర్ల వెడల్పు 20 మీటర్ల పొడవు రోడ్డును నిర్మించారు. ఈ రోడ్డు నిర్మాణంలో ఇసుక వాడకపోవడంతో వర్షం నీరు రోడ్డులోకి ఇంకుతుందని అధికారులు అంటున్నారు. ఇలాంటి రోడ్లతో భూగర్భ జలమట్టం కూడా పెరుగుతుందని చెబుతున్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి కిలోమీటర్ కి రూ.30 లక్షల ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. ఇతర రోడ్లతో పోల్చితే నీరు భూమిలోకి ఇంకడం కొత్త రోడ్ల ప్రత్యేకత అంటున్నారు. హైదరాబాద్‌లో నీరు ఇంకిపోయే రోడ్లు వేస్తే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు. రోడ్లపై వర్షం నీటి సమస్య ఉండదని, గ్రౌండ్‌ వాటర్‌ రీచార్జ్‌ అవుతుందని వివరిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్లాన్‌ చేస్తున్న సరికొత్త రోడ్లపై నగరవాసుల్లో ఆసక్తి నెలకొంది.

పర్మియబుల్‌ రోడ్లు మన దగ్గర ఇంకా ఆలోచనల్లోనే ఉంటే.. విదేశాల్లో ఎప్పుడో అమలవుతోంది. ఎన్ని వేల లీటర్ల నీటిని అక్కడి రోడ్లపై పోసినా కేవలం ఒకే నిమిషంలో ఆ నీరంతా రోడ్ల లోపలికి ఇంకి పోతుంది. అక్కడ రోడ్లపై గుంతలను వెతకాలి. కానీ మన దగ్గర గుంతల్లో రోడ్లను వెతకాల్సిన పరిస్థితి. నాణ్యతా ప్రమాణాల లోపం, శాఖల మధ్య సమన్వయలేమితో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. రోడ్డు వేసిన కొద్ది రోజులకే గుంతలు పడి వాహనదారులకు చుక్కలు కనపడుతున్నాయి. దీనికి తోడు వర్షం పడిందంటే ఆ గుంతల్లో పెద్ద ఎత్తున నీరు చేరుతుంది. అలాంటి దారిపై ప్రయాణించాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉంది. పర్మియబుల్ రోడ్లతో ఈ సమస్యలకు పరిస్కారం లభిస్తుందని అధికారులు నమ్మకంగా చెబుతున్నారు. నిజంగా అదే జరిగితే.. నగరవాసులకు ఇక అన్నీ మంచి రోజులే.