పాపను నాలా మింగేసిందా? నేరేడ్‌మెట్‌లో బాలిక మిస్సింగ్ కలకలం, నాలా సమీపంలో సైకిల్ లభ్యం

10TV Telugu News

హైదరాబాద్‌ నేరేడ్‌మెట్‌లో బాలిక మిస్సింగ్ కలకలం రేపుతోంది. కాకతీయనగర్‌కు చెందిన సుమేధ అనే బాలిక నిన్న(సెప్టెంబర్ 17,2020) సాయంత్రం సైకిల్‌పై బయటకు వెళ్లింది. ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. కాకతీయనగర్‌లో సీసీ టీవీ ఫుటేజ్‌ పరిశీలించారు. సుమేధ సైకిల్‌పై వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆ తర్వాత కాకతీయ నగర్‌ నాలా దగ్గర సుమేధ సైకిల్‌ లభ్యమైంది. దీంతో బాలిక కూడా నాలాలో పడిపోయింటుందని అనుమానిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్ సాయంతో నాలాలో బాలిక కోసం రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు పోలీసులు.నిన్న సాయంత్రం సైకిల్ పై బయటకు వెళ్లిన చిన్నారి:
కొన్ని గంటలుగా పాప కోసం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. సైకిల్ ఎక్కడైతే లభ్యమైందో అక్కడ మాత్రం బాలిక ఆచూకీ లభించ లేదు. దీంతో మరో ప్లేస్ లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. సుమేధ నిన్న సాయంత్రం 6.30 గంటల సమయంలో సైకిల్ పై బయటకు వెళ్లింది. నిన్న బయటకు వెళ్లిన చిన్నారి ఎంతకూ ఇంటికి రాకపోవడంతో నిన్న రాత్రి 9 గంటల సమయంలో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి పోలీసులు చిన్నారి ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. కానీ ఇంతవరకు ఆచూకీ దొరకలేదు.

girl missing neredmetపాపను ఎవరో తీసుకెళ్లారు అనే అనుమానాలు:
విషయం తెలుసుకుని స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కూడా వచ్చారు. సెర్చ్ ఆపరేషన్ గురించి పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పాప నాలాలో పడలేదు, ఎవరైనా పాపను తీసుకెళ్లి, సైకిల్ ను మాత్రం నాలాలో పడేశారేమో అనే అనుమానం కలుగుతోందని ఎమ్మెల్యే అన్నారు. పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు, కచ్చితంగా పాప ఆచూకీ కనిపెడతారని ఆయన చెప్పారు.

పాప నాలాలో పడే సమస్యే లేదు:
పాప తల్లిదండ్రులు మాత్రం, తమ పాప నాలాలో పడే సమస్యే లేదంటున్నారు. ఎవరైనా తీసుకుని వెళ్లి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ పాప నిత్యం అలర్ట్ గా ఉంటుందని తల్లి చెప్పారు. అంత ఈజీగా నాలాలో పడిపోతుందని అనుకోవడం లేదన్నారు. తను ఎక్కడో క్షేమంగా ఉండే ఉంటుంది అని పాప తల్లి నమ్మకం వ్యక్తం చేశారు. నాలాలో అయితే ఉండదు అని కచ్చితంగా చెప్పగలను అని ఆమె అన్నారు. కాగా, ప్రొక్లెయిన్ తో నాలాను తవ్వి రెస్క్యూ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
×