GHMC ఎన్నికల్లో పాల్గోన్నవారు వారం పాటు హోం క్వారంటైన్ లో ఉండాలి

  • Published By: murthy ,Published On : December 3, 2020 / 06:04 AM IST
GHMC ఎన్నికల్లో పాల్గోన్నవారు వారం పాటు హోం క్వారంటైన్ లో ఉండాలి

go for tests immediately if corona symptoms appear : రాష్ట్రంలో కరోనా వైరస్‌ అదుపులోనే ఉన్నదని…..జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు విధిగా వారం రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని రాష్ట్ర ప్రజారోగ్య విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసరావు సూచించారు. కరోనా లక్షణాలున్నట్టు అనుమానం కలిగితే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కరోనా పరిస్థితులపై బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్న వేళ నిర్లక్ష్యం ప్రదర్శించి సెకండ్‌వేవ్‌కు కారణం కావొద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 55.51 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించామని వివరించారు. పాజిటివిటీ రేటు గతంలో 23 శాతం ఉండగా ఇప్పుడు 1.1 శాతానికి పడిపోయిందని తెలిపారు. అనేక అంశాల్లో జాతీయ సగటుకన్నా తెలంగాణ మెరుగ్గా ఉన్నదని పేర్కొన్నారు.



రాష్ట్రంలో కరోనా పూర్తిగా అదుపులో ఉన్నదని చెప్పారు. రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటోందని తెలిపారు. వ్యాక్సిన్‌ సాఫ్ట్‌వేర్‌ ‘కొవిన్‌’ ప్రయోగాత్మక పరిశీలనకు కేంద్రప్రభుత్వం తెలంగాణ, రాజస్థాన్‌ను ఎంపిక చేసిందని తెలిపారు. రాష్ట్రంలో బొగ్గుల కుంటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సాఫ్ట్‌వేర్‌ డ్రైరన్‌ నడుస్తోందని చెప్పారు.



మంగళవారం నాటికి యాక్టివ్‌ కేసుల నిష్పత్తి రాష్ట్రంలో 3.4 శాతంగా ఉండగా, దేశవ్యాప్తంగా 4.5 శాతం నమోదైందని చెప్పారు. మరణాల రేటు దేశంలో 1.54గా ఉండగా రాష్ట్రంలో 0.53 శాతం మాత్రమేనని తెలిపారు. 1,096 కేంద్రాల్లో ఉచితంగా పరీక్షలు చేస్తున్నామని, గ్రేటర్‌ పరిధిలో అదనంగా మరో 50 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.



కరోనా పరీక్ష కేంద్రాల సమాచారం కోసం 104 లేదా 040-24651119 నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు. కరోనా నుంచి కోలుకున్నవారు రెండు నెలల తర్వాత ఇతర ఆరోగ్య సమస్యలతో మళ్లీ ఆస్పత్రులకు వస్తున్నారని వైద్యవిద్య సంచాలకుడు రమేశ్‌ రెడ్డి తెలిపారు. అందువల్ల కొవిడ్‌ సోకినవారు 3 నెలల నుంచి ఏడాదిపాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు.