టార్గెట్ 2050 : మెట్రో సర్వీసుల విస్తరణపై ప్రభుత్వం ఫోకస్

  • Published By: veegamteam ,Published On : March 4, 2019 / 03:51 AM IST
టార్గెట్ 2050 : మెట్రో సర్వీసుల విస్తరణపై ప్రభుత్వం ఫోకస్

హైదరాబాద్: నిత్యం ట్రాఫిక్ సమస్యతో నరకం చూస్తున్న నగరవాసుల కష్టాలు తీర్చేందుకు మెట్రో రైలు తీసుకొచ్చారు. మెట్రో ద్వారా కొంతవరకు ట్రాఫిక్ కష్టాలు తీరాయి. ప్రస్తుతం మియాపూర్ నుంచి నాగోల్ వరకు, మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్ వరకు సర్వీసులు నడుస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం భవిష్యత్తు అవసరాలపై ఫోకస్ చేసింది. ప్రజారవాణ వ్యవస్థను మరింత మెరుగుపరిచే దిశగా చర్యలు చేపట్టింది. ఈ మేరకు అవసరాలను గుర్తించాలని సూచించడంతో హైదరాబాద్‌ మెట్రో అధికారులు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు.

నగరం నలుమూలల నుంచి మెట్రో రైలు సర్వీసులు నడిపేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఫలక్‌నుమా నుంచి రేతిబౌలి వరకు,  గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి తెల్లాపూర్‌, లింగంపల్లి వరకు.. ఎల్‌బీనగర్‌ నుంచి సాగర్‌రోడ్డులోని ఓఆర్‌ఆర్‌ దాకా.. ఫలక్‌నుమా నుంచి శ్రీశైలం రోడ్డు ఆర్‌సీఐ.. తుక్కుగూడ దాకా.. ఉప్పల్‌ నుంచి ఘట్‌కేసర్‌ వరకు.. లక్డీకాపూల్‌ నుంచి ఉప్పల్‌ దాకా.. జేబీఎస్‌ నుంచి కొంపల్లి మార్గంలో… ఇలా అన్ని వైపుల మెట్రో సర్వీసులు అందుబాటులోకి తెచ్చేందుకు ఫోకస్ పెట్టారు.

ఇమ్లీబన్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5 కి.మీ.పైగా మార్గం మొదటిదశలోనిది. అలైన్‌మెంట్‌ వివాదాలతో ఇప్పటివరకు పనులే మొదలు కాలేదు. ఇక్కడ మెట్రోను విస్తరించాల్సి ఉంది. రూ.1,200  కోట్ల వరకు నిధులు కావాలి. మెట్రోరైలు రెండోదశలో తొలుత రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 30 కి.మీ., బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకాపూల్‌ 28 కి.మీ., నాగోల్‌ నుంచి  ఎల్‌బీనగర్‌ వరకు 5 కి.మీ. మాత్రమే చేపట్టబోతున్నారు. మంత్రిమండలి ఆమోదం అనంతరం రెండోదశకు ప్రభుత్వం శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. 63 కి.మీ. రెండోదశ పనులు చేపట్టేందుకు  రూ.12 వేల కోట్ల నిధులు కావాలి.

ఓఆర్‌ఆర్‌ నుంచి ఆర్‌ఆర్‌ఆర్ వరకు.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. మార్చి 5లోగా వివరాలు పంపాలని  సంబంధిత శాఖలను కోరింది. ముఖ్యంగా నగరంలో జనాభాకు అనుగుణంగా ప్రజారవాణా పెరగడం లేదని ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మెట్రోపరంగా ఇప్పటికే పలు మార్గాల్లో ప్రస్తుత,  భవిష్యత్తు అవసరాలపై హెచ్‌ఎండీఏకు లీ అసోసియేట్స్‌ ఇచ్చిన నివేదికలు ఉన్నాయి. పెరుగుతున్న ట్రాఫిక్‌ ఇబ్బందుల దృష్ట్యా మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించాలని ప్రజలు  కోరుతున్నారు.

మరిన్ని ప్రాంతాలకు మెట్రో సర్వీసులు:
* ఎల్‌బీనగర్‌ నుంచి ఫలక్‌నుమా, అక్కడి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణ పరిశీలనలో ఉంది. 23 కి.మీ. దూరం ఉండే ఈ మార్గం ఇటీవల కాలంలో జనావాసాలు బాగా  విస్తరించాయి.
* బీహెచ్‌ఈఎల్‌ నుంచి పటాన్‌చెరు 6 కి.మీ. వరకు వేయాలనే డిమాండ్‌ ఉంది. రెండోదశలో తొలుత చేపట్టే బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకాపూల్‌ వెళ్లే మార్గం మియాపూర్‌ను కలుపుతూ వెళుతుంది.  కాబట్టి నగరంలోకి ఎక్కడికైనా వేగం చేరుకోవచ్చు.
* ఎల్‌బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ 7 కి.మీ. వరకు మెట్రో విస్తరించాలనే డిమాండ్లు ఉన్నాయి. ఇప్పటికే ఇక్కడి దాకా నగరం విస్తరించింది. భవిష్యత్తులో ఓఆర్‌ఆర్‌ వరకు పొడిగించవచ్చు.  ఫలితంగా మరో 8 కి.మీ. పెరుగుతుంది.
* జేబీఎస్‌ నుంచి అల్వాల్‌ వరకు 8 కి.మీ. మార్గం మొదటి నుంచి ఈ ప్రాంతవాసుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. మలి విడతలోనైనా ఈ మార్గంలో మెట్రో విస్తరించాలని స్థానికుల నుంచి డిమాండ్లు  ఉన్నాయి.
* తార్నాక నుంచి ఈసీఐఎల్‌ చౌరస్తా 7 కి.మీ. మార్గం పరిశీలనలో ఉంది. నగరంలోకి వేగంగా అనుసంధానం పెరుగుతుంది.

భవిష్యత్తు ప్రణాళికలపై ఇటీవల ప్రభుత్వం ప్రాథమిక సమావేశాన్ని నిర్వహించిందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే ఫార్మాట్‌ ప్రకారం 2050 నాటికి మెట్రో విస్తరణకు  సంబంధించిన వివరాలు అందించనున్నట్టు చెప్పారు. గతంలో లీ అసోసియేట్స్‌ 400 కి.మీ.పైగా అవసరం అని హెచ్‌ఎండీఏకు నివేదిక ఇచ్చిందని, మెట్రో చేపట్టాలంటే చాలా నిధులు అవసరం అని  చెప్పారు. కాబట్టి ఏయే మార్గాల్లో అవసరం ఉంది? అక్కడి సాధ్యాసాధ్యాలను పరిశీలించి వివరాలను అందించనున్నట్టు ఎన్వీఎస్ రెడ్డి వివరించారు.