ఎన్నికల వేళ నోట్ల కట్టలు : ఒక్కరోజే రూ. 4 కోట్లు సీజ్  

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేళ... పెద్దఎత్తున డబ్బు సంచులు బయట పడుతున్నాయి.

  • Published By: veegamteam ,Published On : April 4, 2019 / 08:21 AM IST
ఎన్నికల వేళ నోట్ల కట్టలు : ఒక్కరోజే రూ. 4 కోట్లు సీజ్  

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేళ… పెద్దఎత్తున డబ్బు సంచులు బయట పడుతున్నాయి.

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయి. నిత్యం పోలీసులు కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఆధారాల్లేకుండా.. సరైన బిల్లులు చూపకుండా తరలిస్తున్న సొమ్మును సీజ్ చేస్తున్నారు. బుధవారం ఒక్కరోజే నాలుగు కోట్లకు పైగా నగదును పట్టుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేళ… పెద్దఎత్తున డబ్బు సంచులు బయట పడుతున్నాయి. అక్రమంగా సొమ్ము తరలిస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్ మాదాపూర్‌ హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్ వద్ద 2 కోట్ల నగదును ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. ఈ సొమ్మును ఇద్దరు వ్యక్తులు రాజమండ్రికి తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. ఎంపీగా పోటీ చేస్తున్న ఒక నేతకి చెందిన డబ్బుగా గుర్తించారు.

హైదరాబాద్‌ ఈస్ట్‌జోన్‌ పరిధిలో హవాలా రాకెట్‌ గుట్టురట్టు చేశారు సుల్తాన్‌బజార్ పోలీసులు. ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి… 18 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరో హవాలా ముఠాకు చెక్ పెట్టిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు… ఆరుగురిని అదుపులోకి తీసుకొని 26 లక్షలు సీజ్ చేశారు.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ దగ్గర ఓ కారులో తరలిస్తున్న 48 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సొమ్ముకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో మొత్తం సొమ్మును సీజ్‌ చేశారు. ఈ నగదు ప్రముఖ రాజకీయపార్టీకి చెందిన ముఖ్యనేతదిగా పోలీసులు అనుమానిస్తున్నారు.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగానగర్‌ చెక్‌పోస్ట్ వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా 32 లక్షల రూపాయలను బస్సులో తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖాజా జమీల్ అనే వ్యక్తి నుంచి 29 లక్షలు, తిరుపతి అనే వ్యక్తి నుంచి 2 లక్షలు, రవీందర్‌ అనే వ్యక్తి నుంచి 98 వేలు సీజ్‌ చేశారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎన్నికల వేళ పెద్దఎత్తున నోట్ల కట్టలు బయట పడుతున్నాయి. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలోని కొత్తకోటలో 72 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో ఓటర్లకు పంచడానికి కోటి రూపాయలు తెచ్చిన డాక్టర్‌ రవితేజ… ఇందులో 28 లక్షలను స్థానిక నాయకులకు అందజేశారని, మిగిలిన డబ్బుతో ఓ గదిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో నగదుతో పాటు రవితేజను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లా గోకవరం చెక్‌పోస్ట్‌ దగ్గర తనిఖీలు నిర్వహించిన పోలీసులు… బైక్‌పై ఇద్దరు వ్యక్తులు తీసుకెళుతున్న 4 లక్షలు పట్టుకున్నారు. ఈ సొమ్ముకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో సీజ్‌ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఇప్పటిదాకా 90 కోట్ల 71 లక్షల నగదు, 91 కేజీల బంగారం, 256 కేజీల వెండితో పాటు 17 వేల 528 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఐటీ శాఖ తనిఖీల్లో 4 కోట్ల 68 లక్షల రూపాయలు సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల వేళ పెద్దఎత్తున డబ్బు తరలించేటప్పుడు… దానికి సంబంధించిన ఆధారాలు దగ్గర ఉంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.