హైదరాబాద్‌లో కుండపోత : నీట మునిగిన కాలనీలు

  • Published By: madhu ,Published On : September 25, 2019 / 12:49 AM IST
హైదరాబాద్‌లో కుండపోత : నీట మునిగిన కాలనీలు

నగరంలో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. సుమారు 6 గంటలకు పైగా వర్షం పడడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. చిన్న సైజు వాగులను తలపిస్తున్నాయి. పలుచోట్ల బైక్‌లు కొట్టుకుపోయాయి. మ్యాన్‌హోల్స్‌ ఉప్పొంగి ప్రవహించాయి. రహదారులపై భారీగా వర్షపు నీరు నిలవడంతో నగరమంతటా ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలు ప్రాంతాల్లో సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి ప్రధాన రహదారులపై వరద పోటెత్తింది. నడుము లోతు నీరు ప్రవహించడంతో వాహనాలు భారంగా ముందుకు కదిలాయి. ప్రధాన రహదారులపై ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ స్తంభించడంతో ఉద్యోగులు, ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మాదాపూర్‌లోని ప్రధాన రహదారి, కృష్ణానగర్‌ పరిసరాలు, చెరువును తలపించాయి. ఆయా ప్రాంతాల్లో బైక్‌లు, కార్లు వరద నీటిలో మునిగిపోయాయి. 

మంగళవారం మధ్యాహ్నం నుంచే దట్టమైన నల్లమబ్బులు నగరాన్ని కమ్మేశాయి. సాయంత్రం మొదలైన వాన మధ్య మధ్యలో తెరపి ఇచ్చినా అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఖైరతాబాద్‌, నాంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్‌, హైటెక్‌సిటీ, మియాపూర్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, అమీర్‌పేట, యూసఫ్‌గూడ, సికింద్రాబాద్‌, ఉప్పల్‌, నేరేడ్‌మెట్‌, ఏఎస్‌ రావు నగర్‌, తిరుమలగిరి, బాలానగర్‌, అల్వాల్‌, షేక్‌పేట్‌, ఆసిఫ్‌నగర్‌, పంజాగుట్ట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీనగర్‌, హయత్‌నగర్‌, రామోజీఫిల్మ్‌సిటీ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముందుజాగ్రత్తగా సహాయ చర్యల కోసం జీహెచ్‌ఎంసీ సిబ్బందిని అధికారులు రంగంలోకి దించారు. పలుచోట్ల నీళ్లు నిలిచిన ప్రాంతాల్లో మోటార్ల ద్వారా ఎత్తిపోశారు. మ్యాన్ హోళ్లను తెరిచి వర్షపు నీటిని కిందికి పంపించారు.

ఉప్పల్‌ వరంగల్‌ ప్రధాన రహదారిలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరంగల్‌ రహదారిపై ఎలక్ట్రికల్‌ జంక్షన్‌ వద్ద నీరు నిలిచిపోవడంతో జిల్లాల నుంచి వచ్చే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌ కృష్ణశేఖర్‌ అత్యవసర టీమ్‌తో వచ్చి వరద నీటిని తొలగించేందుకు ప్రయత్నించారు. ఈసీఐఎల్, కుషాయిగూడ, చర్లపల్లి, హెచ్‌బీకాలనీలల్లోనూ రోడ్లన్నీ జలమయమయ్యాయి. 
Read More : మౌనిక చనిపోయిన మరుసటి రోజే : మెట్రో కాంట్రవర్సీ ట్వీట్