చుక్కలు చూపించిన వరుణుడు : హైదరాబాద్‌లో కుండపోత

  • Published By: madhu ,Published On : September 18, 2019 / 01:54 AM IST
చుక్కలు చూపించిన వరుణుడు : హైదరాబాద్‌లో కుండపోత

హైదరాబాద్‌‌లో వరుణుడు చుక్కలు చూపించాడు. సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. గంటకుపైగా వర్షం కురవడంతో రోడ్లపైన నీరు భారీగా చేరింది. రహదారులు జలమయం కావడంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు  పడ్డారు. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరించారు. డీఆర్‌ఎఫ్‌ బృందాలను అధికారులు రంగంలోకి దించారు. 

రాత్రి 10 గంటల ప్రాంతంలో మొదలైన వర్షం.. అర్థరాత్రి 12.30 వరకు కురిసింది.  ముఖ్యంగా జూబ్లీహీల్స్, బంజారా హిల్స్, ఎస్సార్ నగర్, అమీర్ పేట్, బేగంపేట ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ద్విచక్రవాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా పలుచోట్ల భారీ వర్షాలు కురవడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

తెలంగాణలోని పలు జిల్లాల్లో  భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో  రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. నాలుగు గంటల్లో 181 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 45 మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇక ఖమ్మం, జనగామ జిల్లాల్లో భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వికారాబాద్‌ జిల్లా మద్గుల్‌ చిట్టంపల్లి వాగు, భద్రాద్రి జిల్లా ములకలపల్లిలో వాగులు పొంగాయి. విద్యార్థులతో కూడిన ఓ పాఠశాల బస్సు కమలాపురం రోడ్డులో వెళ్తూ చప్పాట పొంగడంతో ఆ గ్రామంలో నిలిచిపోయింది. విద్యార్థులకు గ్రామస్థులు ఆహారం అందించి బస ఏర్పా టు చేశారు. పిల్లలు ఇంటికి చేరుకోక పోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.
మారేడ్ పల్లి, విజయనగర్ కాలనీలో 6 సెం, మీ

చర్లపల్లి, రామచంద్రాపురం, బీహెచ్ఎల్ ప్రాంతాల్లో 5.5 సెం.మీ
గుడిమల్కాపురం, అడ్డగుట్టలో 5 సెం.మీ
గచ్చిబౌలి, మాదాపూర్‌లో 4.5 సెం.మీ వర్షాపాతం నమోదైంది. 
Read More : ట్రాఫిక్ వసూళ్లు: పోలీసులను ప్రశ్నించిన సామాన్యుడు.. వైరల్ అయిన వీడియో