భయ గుప్పిట్లో హైదరాబాద్.. ఈ రాత్రి గడిచేదేలా.. కుంభవృష్టి కురుస్తోంది!

  • Published By: sreehari ,Published On : October 17, 2020 / 09:50 PM IST
భయ గుప్పిట్లో హైదరాబాద్.. ఈ రాత్రి గడిచేదేలా.. కుంభవృష్టి కురుస్తోంది!

హైదరాబాద్‌ను భారీ వర్షం మళ్లీ కుమ్మేసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల బీభత్సం నుంచి తేరుకోకముందే మళ్లీ భారీ వర్షం కురిసింది. మూడు రోజుల గ్యాప్ తర్వాత.. అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. గంట వ్యవధిలోనే 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటీవల కురిసిన వర్షంతో చేరిన వరద నీరు పోయినప్పటికీ బురద పేరుకుపోవడంతో ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.



ఇప్పుడు కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. టోలీచౌకి వద్ద వరదనీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో బయో-డైవర్సిటీ, గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వైపు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. తెలంగాణను ఇప్పట్లో వరుణుడు వదలేటట్లు లేడు.



భయం గుప్పిట్లో హైదరాబాద్ : 
కొన్ని రోజులుగా సూర్యుని ముఖం చూడని ప్రజలు వానంటేనే వద్దంటున్నారు. హైదరాబాద్‌ను ఓ కుదుపు కుదిపిన భారీ వర్షాలు కాస్త తెరిపి ఇవ్వడంతో భాగ్యనగర వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే మళ్లీ భారీ వర్షం కురియడంతో భయం గుప్పిట్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు జీవిస్తున్నారు. కుంభవృష్టి కురుస్తుండటంతో చైతన్యపురిలో రోడ్లను వరద ముంచెత్తింది. వరదలో కొట్టుకుపోతున్న నలుగురిని స్థానికులు రక్షించారు. ఉప్పల్, బండ్లగూడలో 10సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సరూర్ నగర్ భవానీ కాలనీలో 9.3 సెంటీమీటర్ల వర్షం నమోదైంది.

మరోసారి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసర సహాయ బృందాలను అప్రమత్తం చేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలకు ఇప్పటికే సిబ్బందిని పంపించినట్లు చెప్పారు. రహదారులపై నీరు నిల్వ ఉండకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు వివరించారు.



రెండు రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడం వల్ల వర్షాలు పడుతున్నాయని, నగరంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

తెలంగాణకు మరోసారి వానగండం :
తెలంగాణకు ఇప్పట్లో వాన గండం తప్పేటట్లు లేదు. ఒకదాని వెంట ఒకటిగా ఏర్పడుతున్న అల్పపీడనాలు.. వాయుగండం నుంచి తేరుకోనీకుండా చేస్తున్నాయి. రెండు రోజులుగా కాస్త తెరిపి ఇచ్చిన వర్షాలు.. మళ్లీ తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. ఈనెల 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. ఆ ప్రభావంతోనే మళ్లీ వర్షాలు పడుతున్నాయని.. వాతావారణ శాఖ అధికారులు చెబుతున్నారు. అటు ఏపీలోనూ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అంటున్నారు. ఈనెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. 24 గంటల తర్వాత తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.



అల్పపీడన ప్రభావంతో.. హైదరాబాద్‌లో శనివారం కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసాయి. దీంతోపాటు వచ్చే మూడు రోజులు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలంతా అత్యవసరం అయితేనే తప్ప బయటకు రాకపోవడమే బెటరని సూచిస్తున్నారు. ఇప్పుడిప్పుడే వరద మిగిల్చిన బురద నుంచి బయటపడతున్న
హైదరాబాదీలు.. మరోసారి వస్తున్న వానలతో కాస్త జాగ్రత్తగానే ఉండాలని చెబుతున్నారు.

ప్రస్తుతం ఉత్తర మహారాష్ట్ర తీరానికి దగ్గరలోని తూర్పు మధ్య అరేబియా సముద్రం, సమీప ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్‌ తీరాలకు దగ్గరలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.

అలాగే పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి, అరేబియా సముద్రంలోని తూర్పు మధ్య, ఈశాన్య ప్రాంతాలపై మరి కొన్ని గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీంతో మరో మూడు రోజులు హైదరాబాద్‌కు మళ్లీ వాన గండం తప్పేటట్టు లేదని భాగ్యనగర వాసులు బెంబేలెత్తుతున్నారు.



ఉప్పల్‌, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌లో భారీ వర్షం
ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో.. ప్రధాన రహదారిపై నీరు నిలిచింది. ప్రధాన రోడ్లు జలమయమవడంతో.. ఎల్బీనగర్ నుంచి విజయవాడకు వెళ్లే రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంద. రోడ్డు మీద వాహనాలు నిలిచిపోవడంతో.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

షేక్‌పేట్‌లో భారీ వర్షం :
హైదరాబాద్‌ షేక్‌పేట్‌లో వర్షం దంచికొట్టింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్థమైంది. రెండు రోజుల పాటు భాగ్యనగర వాసులను ఇబ్బందులకు గురిచేసిన వర్షం.. మరోసారి తన ప్రతాపాన్ని చూపడంతో.. షేక్‌పేట వాసులు ఇబ్బందులు పడ్డారు.



భారీ వర్షంతో నిలిచిన ట్రాఫిక్‌ :
హైదరాబాద్‌ వాసులను భారీ వర్షం మరోసారి ఇబ్బందులకు గురి చేస్తోంది. సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షంతో.. జనజీవనం స్తంభించింది. భారీ వర్షంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బండులు పడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలు
క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయన్నారు వాతావరణ శాఖ అధికారి రాజారావు. అరేబియా సముద్రంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో.. రెండు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం లేదన్నారాయన. ఈ నెల 19న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.