నీటితో నిండిన హిమాయత్ సాగర్….గేట్లు ఎత్తి మూసీ లోకి నీరు విడుదల

  • Published By: murthy ,Published On : October 14, 2020 / 07:58 AM IST
నీటితో నిండిన హిమాయత్ సాగర్….గేట్లు ఎత్తి మూసీ లోకి నీరు విడుదల

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయు గుండం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.మంగళవారం  రోజంతా భారీ వర్షం కురవడంతో అతలా కుతలమైంది. రోడ్లపై భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు, కాలనీలు నీట మునిగాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొ ద్దని పోలీసులు హెచ్చరించారు. మంగళవారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా సగటున 2.19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.




ఎడతెరపి లేకుండా కురిసిన వానతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ అతలాకుతలమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు మంగళ వారం తెల్లవారుజామున మొదలైన వర్షం.. అర్ధరాత్రి వరకు కురుస్తూనే ఉంది. పట్టుమని పది నిమిషాలు కూడా తెరపినివ్వకపోవడంతో దాదాపుగా నగరం మొత్తం జల దిగ్బంధనంలో చిక్కుకుంది.

హైదరాబాద్ , రంగా రెడ్డి జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా కురిసిన భారీ వర్షాలతో హిమాయత్‌సాగర్‌ జలాశయం లోకి భారీగా నీరు వచ్చి చేరింది. జలాశయం పూర్తి స్ధాయిలో నిండి పోవటంతో అధికారులు అప్రమత్తమై గేట్లు ఎత్తారు. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 1763.50 అడుగులు కాగా మంగళవారం రాత్రి గం.12 కి జలాశయంలో 1763 అడుగులకు  నీరు చేరుకుంది.himayatsagarసోమవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి 11,111 క్యూసెక్కుల నీరు రాగా మంగళవారం రాత్రి 12 గంటలకు 1763 అడుగుల (2.654 టీఎంసీల) నీటి మట్టానికి చేరింది. దీంతో జలమండలి అధికారులు అర్ధరాత్రి 12 గంటలకు మొత్తం 17 గేట్లలో హిమాయత్‌సాగర్‌ రెండు గేట్లు ఎత్తి 1,300 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేశారు.




లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో ఆధారంగా మరిన్ని గేట్లను ఎత్తేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఉస్మాన్‌సాగర్‌ గరిష్ఠ నీటి స్థాయి మట్టం 1790 అడుగులు కాగా 1773.696 అడుగులకు చేరింది. ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుంచి 833 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది.

హుస్సేన్‌ సాగర్‌తోపాటు జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌తోపాటు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 185 చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. వర్ష బీభత్సానికి పాతనగరం సహా పలు ప్రాంతాల్లో శిథిల భవనాలు, చెట్లు నేలకూలాయి. రాగల 24 గంటల్లో నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురవచ్చని బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది.




మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు సరాసరిన 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నగరంలో వచ్చే 24 గంటల్లో 10–15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలుండడంతో జీహెచ్‌ఎంసీ, జలమండలి, పోలీసు, రెవెన్యూ విభాగాల సిబ్బందిని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది.. శిథిల భవనాల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించారు.