ఆకాశానికి చిల్లు పడిందా : దంచి కొడుతున్న వానలు

  • Published By: madhu ,Published On : September 19, 2019 / 01:24 AM IST
ఆకాశానికి చిల్లు పడిందా : దంచి కొడుతున్న వానలు

ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా..తెలుగు రాష్ట్రాలపై వరుణుడు విరుచుకపడుతున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం సాయంత్రం నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. వికారాబాద్, మహబూబాబాద్, జిల్లాల్లో ఓ మోస్తరు వాన పడింది. నల్లగొండలో వర్షం ఏకదాటిగా కురిసింది. 

నల్గోండ, ఖమ్మం, ఆదిలాబాద్ మూడు జిల్లాల్లో వర్షం దంచి కొట్టింది. సాధారణ జన జీవనానికి విఘాతం కలిగింది. పంటలకు నష్టం వాటిల్లుతోంది. అనేక గ్రామాల్లో పంటపొలాలు నీటమునిగాయి. నల్గొండ జిల్లాలోని 31 మండల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. యాదాద్రి జిల్లాలో 12మండలాలు, సూర్యాపేటలో 20మండలాల్లో కుంభవృష్టి కురిసింది. 

తెలంగాణలో వచ్చే ఐదు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సెప్టెంబర్ 19వ తేదీ గురువారం అనేక ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దక్షిణ కోస్తాంధ్ర తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో వచ్చే 12 గంటలలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న కోస్తాంధ్ర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

ఆవర్తనం ప్రభావంతో ఏపీలో మరో మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాయలసీమతో పాటు.. ప్రకాశం, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించారు. గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వివరించారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. 
Read More :