పండుగ కష్టాలు : కిక్కిరిసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

  • Published By: madhu ,Published On : October 6, 2019 / 12:44 PM IST
పండుగ కష్టాలు : కిక్కిరిసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

ప్రతి సంవత్సరం తాము ఇలాగే కష్టాలు పడుకుంటూ వెళ్లాల్సిందేనా..సరిపడా..డబ్బులు ఇచ్చినా..ప్రయాణీకులకు కనీస సౌకర్యాలు చూడరా అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రయాణీకులు. దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేందుకు భారీగా ప్రయాణీకులు తరలివెళుతున్నారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది. ఎంతలా ఉందంటే..ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు.

రైలు వచ్చిందే ఆలస్యం..సీటు దక్కించుకొనేందుకు కుస్తీలు పడుతున్నారు. వాగ్వాదం, తోపులాటలు చోటు చేసుకుంటున్నాయి. ఏ కంపార్ట్ మెంట్ చూసినా ఇదే పరిస్థితి కనపడుతోంది. మహిళలు, చంటి పిల్లలున్న వారి పరిస్థితి దయనీయంగా ఉంది. శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు నిలబడి ప్రయాణం చేస్తున్నారు. రైలు కిటికీలో నుంచి దూకి సీటు దక్కించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఇతర రవాణా రంగాలపై ప్రభావం చూపిస్తోంది. బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనాలు, రైళ్ల వైపు పరుగులు తీస్తున్నారు. ప్రధాన స్టేషన్లు నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో విపరీతమైన రద్దీ నెలకొంది. అక్టోబర్ 08వ తేదీ దసరా పండుగ కావడంతో..ఊరెళ్లడానికి అక్టోబర్ 06వతేదీ ఆదివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ప్రయాణీకులు పోటెత్తారు.

లగేజీ బ్యాగులు పెట్టుకొనే ప్లేస్‌లలో కూర్చొని ప్రయాణిస్తున్నారు. కొంతమంది రైలు తలుపుల వద్దే నిలబడి ప్రయాణిస్తున్నారు. గంటల తరబడి తాము జర్నీ చేయాల్సి వస్తోందని, దీనివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వాపోయారు. దసరా పండుగ సందర్భంగా అదనపు బోగీలు వేస్తామని చెప్పారు..ఎక్కడా అంటూ ప్రశ్నిస్తున్నారు. వేలాది మంది హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి వివిధ జిల్లాలకు, రాష్ట్రాలకు వెళుతున్నారు.

ముందే రద్దీ ఉంటుందని ఊహించిన రైల్వే శాఖ..పోలీసులను మోహరించింది. ఎలాంటి ప్రమాదం జరుగకుండా ఉండేందుకు రద్దీని వారు నియంత్రిస్తున్నారు. కానీ వారి వల్ల కూడా కావడం లేదు. తాము పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావంటున్నారు. కనీసం అదనపు బోగీలు కూడా ఏర్పాటు చేయలేదని, రైలు ఎక్కాలంటే ఫైటింగ్ చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికైనా రైల్వే శాఖ స్పందించి ప్రత్యేక రైళ్లు, అదనపు బోగీలు ఏర్పాటు చేయాలంటున్నారు ప్రయాణీకులు.