ఇంటర్ హీట్ : బోర్డు ముట్టడించిన స్టూడెంట్స్

  • Published By: madhu ,Published On : April 29, 2019 / 04:55 AM IST
ఇంటర్ హీట్ : బోర్డు ముట్టడించిన స్టూడెంట్స్

ఇంటర్ బోర్డు దగ్గర విద్యార్థి సంఘాలు ఆందోళన కంటీన్యూ చేస్తున్నాయి. ఫలితాల్లో గందరగోళంపై బోర్డు ముట్టడించాయి. భారీ సంఖ్యలో వచ్చిన స్టూడెంట్స్ ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు. తోపులాట..వాగ్వాదం తర్వాత బలవంతంగా అరెస్ట్ చేసి తరలించారు. పోలీసుల తీరుపైనా స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే.. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని నిలదీశారు స్టూడెంట్స్. 

ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యత వహిస్తూ.. విద్యాశాఖ మంత్రి  రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫలితాల్లో తప్పులకు కారణమైన గ్లోబరీనా సంస్థపైనా చర్యలు తీసుకోవాలని.. ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు విద్యార్థులు. తప్పుడు ఫలితాల వల్ల 23 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారని.. దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారని నిలదీశారు.

ఇంటర్ బోర్డు ముట్టడికి అఖిలపక్షం పిలుపునివ్వడంతో పోలీసులు భారీగా మోహరించారు. కార్యాలయం దగ్గర మూడెంచల భద్రత ఏర్పాటు చేశారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. ఎవరినీ బోర్డు బోర్డు వైపు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ముందస్తుగా నేతలను హౌజ్ అరెస్టు చేశారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబాలకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో అఖిలపక్షాలు ఆందోళనకు దిగాయి. త్రిసభ్య కమిటీ ఎత్తిచూపిన లోపాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఇకతెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నారు. అన్ని పార్టీలు ఇంటర్ బోర్డుపై ఆందోళనలతో హీట్ పెంచాయి.