హైటెక్ సిటీ-రాయదుర్గం మెట్రో సేవలు ప్రారంభం

  • Published By: chvmurthy ,Published On : November 29, 2019 / 02:49 AM IST
హైటెక్ సిటీ-రాయదుర్గం మెట్రో సేవలు ప్రారంభం

హైదరాబాద్‌కు తలమానికమైన మెట్రో రైలు సేవలు  మరింత విస్తరిస్తున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఐటీ ఉద్యోగులు ఎదురు చూస్తున్న  హైటెక్ సిటీ-రాయదుర్గం మెట్రో మార్గం నేడు ఫ్రారంభంకాబోతోంది. ఇప్పటివరకు నాగోల్‌ నుంచి హైటెక్‌సిటీ వరకు నడిచే మెట్రో రైలు…  నవంబర్ 29 శుక్రవారం నుంచి మైండ్‌ స్పేస్‌ వరకు పరుగులు పెట్టబోతోంది. ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ జామ్‌ నుంచి ఊరట కల్పించబోతోంది. రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి  పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు ఉదయం 10గంటల 15 నిమిషాలకు దీనిని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రాయదుర్గం వరకు అధికారులతో కలిసి మెట్రోలో ప్రయాణిస్తారు. మధ్యాహ్నం నుంచి మెట్రోరైలు  ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.

ఇప్పటివరకు నగరంలో 56 కిలోమీటర్ల మార్గంలో సేవలందిస్తున్న మెట్రో.. ఇవాళ్టి నుంచి దానిని మరో  కిలోమీటరున్నరకు పెంచుకుంటోంది. ఇప్పటివరకు హైటెక్‌సిటీ వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండగా.. నేటినుంచి మెండ్‌స్పేస్ జంక్షన్ వరకు మెట్రో ప్రయాణం అందుబాటులోకి రానుంది. సరిగ్గా రెండేళ్ల క్రితం అమీర్‌పేట్‌-మియాపూర్ మార్గంలో మొదటిసారి పరుగులు పెట్టిన మెట్రో రైలు… ఆ తర్వాత అమీర్‌పేట-ఎల్బీనగర్‌ రూట్‌లోను దూసుకుపోయింది. ఇక ఈ ఏడాది మార్చిలో అమీర్‌పేట్ – హైటెక్‌సిటీ రూట్‌లోను ప్రారంభమైన మెట్రో… ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతోంది. ఇప్పటికే మెట్రో రైలు… ప్రతిరోజు 4లక్షల మంది ప్రయాణికులను చేరవేస్తోంది. 99.8శాతం పంక్చువాలిటీతో సేవలు అందిస్తున్న మెట్రో… ఇప్పటివరకు 12.50కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. 

రాయదుర్గం వరకు మెట్రో సేవలు పెరగటం వల్ల ఈమార్గంలో మెట్రోకు అదనంగా 40 వేలమంది ప్రయాణికులు పెరుగుతారని అధికారులు  అంచనా వేశారు. కారిడార్ -3 మార్గంలో భాగంగా ఇప్పటికే నాగోల్ నుంచి హైటెక్‌సిటీ వరకు రాకపోకలు సాగిస్తుండగా మరో 1.5 కి.మీ. మార్గం నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ఢిల్లీ తర్వాత దేశంలోనే అతి ఎక్కువ మెట్రోమార్గం కలిగిన సిటీగా హైదరాబాద్‌ గుర్తింపు పొందింది. ఇప్పటివరకు అనేక అంశాల్లో దేశవిదేశాల నుంచి 98 అవార్డులు అందుకుని తనదైన స్పీడ్‌లో దూసుకుపోతోంది. ఇక ఇపుడు… ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌ నుంచి మెట్రో సేవలు ప్రారంభమైతే ట్రాఫిక్‌జామ్‌ నుంచి వేలాది మంది టెకీలకు ఊరట లభిస్తుంది. ఇటు… జూబ్లీ బస్‌స్టేషన్‌ టు ఎంజీబీఎస్‌ రూట్‌ కూడా త్వరలోనే ఫ్రజలకు అందుబాటులోకి రానుంది.