ORRపై ఫ్రీ జర్నీ : రద్దీ పెరిగిందా..అయితే టోల్ ఫీజు లేదు

  • Published By: madhu ,Published On : March 1, 2019 / 01:57 AM IST
ORRపై ఫ్రీ జర్నీ : రద్దీ పెరిగిందా..అయితే టోల్ ఫీజు లేదు

ఔటర్ రింగ్ రోడ్డుపై సాఫీగా ప్రయాణించాలని చాలా మంది అనుకుంటుంటారు. కానీ అది నెరవేరదు. కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇక ఈ సమస్యకు చెక్ పడనుంది. హెచ్ఎండీఏ దీనిపై దృష్టి సారించింది. కొత్త విధానాన్ని అమలు చేయనుంది. లేన్ల సంఖ్యను పెంచడం, ఒక లేన్‌పై 20కి మించి వాహనాలుంటే టోల్ రుసుము వసూలు చేయకూడదని నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ట్రాఫిక్ తగ్గే అవకాశాలున్నాయని, ఫలితంగా వాహనదారులు సాఫీగా జర్నీ చేసే అవకాశం ఉందని భావిస్తోంది. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఈ కొత్త విధానాన్ని అమలు చేయబోతోంది. 

ఔటర్ రింగ్ రోడ్డు..కొన్ని జిల్లాల వాసులు హైదరాబాద్ నగరంలోకి వచ్చేందుకు ORR మార్గాన్ని ఎంచుకుంటున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల ప్రజలతో పాటు నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లా వాసులు ఓఆర్ఆర్ మార్గంలో ప్రయాణిస్తుంటారు. 8 లైన్ల ORRలో 19 యాక్సెస్ పాయింట్లు ఉన్నాయి. అయితే నానక్ రామ్ గూడ, శంషాబాద్ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాలు అత్యధికంగా ఉంటున్నాయి. ఫలితంగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. ఆయా టోల్ ప్లాజాల వద్ద లేన్ల సంఖ్యను పెంచాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 

ట్రాఫిక్ వెతలు లేకుండా ఒక లైన్‌పై 20కి మించి వాహనాలుంటే టోల్ రుసుము తీసుకోకుండానే క్లియర్ చేయాలని ‘ఈగల్ ఇన్ ఫ్రా ఇండియా లిమిటెడ్‌’ను HMDA అధికారులు ఆదేశించారు. మార్చి 01వ తేదీ శుక్రవారం నుండి ఈగల్ ఇన్ ఫ్రా ఇండియా లి. టోల్ రుసుము వసూలు బాధ్యతలను తీసుకొంటోంది. పాత సంస్థ ఐఆర్‌బీ ఇన్ ఫ్రా స్ట్రక్చర్స్ లిమిటెడ్ వాహనదారులకు జారీ చేసిన నెలవారీ పాసులను సమర్పించాలని, కొత్త ఈజెన్సీ ఈగల్ ఇన్ ఫ్రా జారీ చేసే పాస్‌లను తీసుకోవాలని వాహనదారులకు హెచ్ఎండీఏ సూచిస్తోంది. మరి HMDA తీసుకొచ్చే కొత్త విధానం వల్ల ట్రాఫిక్ సమస్య తీరుతుందా ? లేదా ? అనేది చూడాలి.