ప్రీమియం రైళ్లలో వేడివేడి భోజనం.. ఫిర్యాదులపైనా సత్వర స్పందన 

ప్రీమియం రైళ్లల్లో ప్రయాణించే ప్రయాణికులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది.

  • Published By: veegamteam ,Published On : February 9, 2019 / 03:00 PM IST
ప్రీమియం రైళ్లలో వేడివేడి భోజనం.. ఫిర్యాదులపైనా సత్వర స్పందన 

ప్రీమియం రైళ్లల్లో ప్రయాణించే ప్రయాణికులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది.

హైదరాబాద్‌ : రైలు ప్రయాణికులకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారంపై రైల్వే శాఖ దృష్టిసారించింది. ప్రీమియం రైళ్లల్లో ప్రయాణించే ప్రయాణికులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. ప్రీమియం రైళ్లలో వేడివేడి భోజనాన్ని అందించడంతోపాటు ఫిర్యాదులపైనా సత్వరం స్పందించాలని భావిస్తోంది. అధిక ఛార్జీలు వసూలు చేసే రాజధాని, దురంతో వంటి ‘ప్రీమియం’ రైళ్లలో కూడా ఆహారం సరిగా లేకపోవడంపై తరచూ ఫిర్యాదులు  వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆహారం వండిన ఐదారు గంటల తర్వాత వడ్డిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైలు ప్రయాణికుల వసతులు, సమస్యలపై రైల్వేబోర్డు ప్రయాణికుల సేవల కమిటీ ఇటీవల సమావేశమైంది. బోర్డు అధికారులతోపాటు ఐఆర్‌సీటీసీ, ఆర్‌పీఎఫ్‌, వివిధ విభాగాల ఎండీలు, డైరెక్టర్లు, రైల్వేబోర్డు ప్రయాణికుల సేవల కమిటీ ఛైర్మన్‌, సభ్యులు.. ప్రీమియం రైళ్లలో భోజనంతోపాటు ఇతర ఫిర్యాదులపై చర్చించారు.

 ‘‘నిజాముద్దీన్‌ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా బెంగళూరుకు వెళ్లే రాజధాని రైలును ఉదాహరణగా తీసుకుంటే.. ఢిల్లీలో సాయంత్రం 4 గంటలకు భోజనం సిద్ధం చేస్తారు. ఆరింటి తర్వాత బండ్లోకి ఎక్కిస్తారు. రాత్రి 8.45 గంటలకి రైలు బయల్దేరుతుంది. ఆ తర్వాత ఆహారాన్ని కాసింత వేడిచేసి రాత్రి 10 గంటల సమయంలో ప్రయాణికులకు అందిస్తారు. చాలా రైళ్లలో ఇదే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బయల్దేరే స్టేషన్‌లోనో, తయారీకి అనుకూలంగా ఉన్న మరోచోటనో కాకుండా భోజనవేళలకు దగ్గరి స్టేషన్‌లో ఆహారం సిద్ధం చేసి అందించే ఆలోచన చేస్తున్నామని.. త్వరలో కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తామని ఐఆర్‌సీటీసీ అధికారులు హామీ ఇచ్చారు’’ అని రైల్వేబోర్డు ప్రయాణికుల సేవల కమిటీ సభ్యుడు వెంకటరమణి మీడియాకు తెలిపారు. రైళ్లలో చోరీలు, బండి ఆపి చేసే దోపిడీలపైనా సమావేశంలో చర్చించారు. రైల్లో ఉండే పోలీసులే ప్రయాణికుల నుంచి ఫిర్యాదు తీసుకుని.. సంబంధిత స్టేషన్‌కు ఫార్వార్డ్‌ చేయడంపై చర్చించారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.