హైదరాబాద్ అలర్ట్ : అవసరం అయితేనే బయటకు రండి

  • Published By: murthy ,Published On : October 14, 2020 / 11:05 AM IST
హైదరాబాద్ అలర్ట్ : అవసరం అయితేనే బయటకు రండి

Hyderabad:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అక్టోబర్13, మంగళవారం ఉదయం గం. 6.30-7.30 గంటల మధ్య కాకినాడ వద్ద తీరాన్ని దాటింది. ఆ తరువాత పశ్చిమ వాయువ్యంగా పయనించి మధ్యాహ్నానికి వాయుగుండంగా బలహీనపడి తెలంగాణలో కేంద్రీకృతమైంది. ఇది మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది.




బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖఅధికారులు తెలిపారు. వీటికి తోడు ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రాన్ని వానలతో ముంచెత్తాయి.

సీజన్‌ ప్రారంభమై రెండు వారాలు గడవక ముందే ఈనెలలో సాధారణ వర్షపాతం రికార్డును బ్రేక్‌ చేస్తున్నాయి. గత నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. అలాగే, గ్రేటర్‌ హైదరాబాద్‌లో హై అలర్ట్‌ ప్రకటించారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్నవర్షాలుతో హైదరాబాద్ శివారులోని లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి.

దాదాపు 1500 కాలనీల్లో నడుం లోతు నీళ్ళు వచ్చి చేరాయని తెలుస్తోంది. వీధులు కాలనీల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు సహయక చర్యలు చేపట్టారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలెవ్వరూ అవసరం అయితే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.




రానున్న రెండు,మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పోలీసులంతా అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు పోలీస్‌శాఖను ఆయన అప్రమత్తం చేశారు. పోలీసులంతా 24గంటలు అందుబాటులో ఉండి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని సూచించారు.

లోతట్టు ప్రాంతాలు, వరద తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. జిల్లా కలెక్టర్లు, విపత్తుల నిర్వహణశాఖతోపాటు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. డయల్ 100 కు వచ్చే ప్రతి ఫోన్‌కు సిబ్బంది తక్షణం స్పందించాలన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులున్నా వెంటనే 100 కు ఫోన్ చేయాలని డీజీపీ ప్రజలను కోరారు

మరో వైపు GHMC కూడా అత్యవసర సేవల పోన్ నెంబర్లను ప్రజలు అందించింది. ఎమర్జెన్సీ సేవల కోసం 040-211111111లను కానీ GHMC విపత్తు నిర్వహణ శాఖ 90001 13667, 97046 01866, GHMC పరిధిలో పడిపోయిన చెట్లు తొలగించటానికి 6309062583, GHMC విద్యుత్ శాఖ 9440813750, NDRF సేవల కోసం 8333068536, 040-29555500 లను సంప్రదించాలని అధికారులు కోరారు.