ప్రపంచంలోనే నెం.1 డైనమిక్ సిటీగా హైదరాబాద్

  • Published By: venkaiahnaidu ,Published On : January 19, 2020 / 09:00 AM IST
ప్రపంచంలోనే నెం.1 డైనమిక్ సిటీగా హైదరాబాద్

అన్ని రంగాల్లో దూసుకుపోతూ ప్రత్యేక నగరంగా గుర్తింపు పొందిన  హైదరాబాద్‌లో సిగలో మరో కలికితురాయి చేరింది. దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నప్పటికీ సామాజిక-ఆర్థిక, స్థిరాస్తి, వ్యాపార అవకాశాలు, ఉపాధి అవకాశాల ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్‌ ప్రపంచంలోనే అత్యంత క్రియాశీల నగరం (డైనమిక్‌ సిటీ)గా అవతరించింది. ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టింగ్‌ సేవల సంస్థ జేఎల్‌ఎల్‌ రూపొందించిన ‘ 2020 సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యంత క్రియాశీల నగరాల జాబితా’లో భాగ్యనగరం మొదటి స్థానంలో నిలిచింది.

ప్రపంచవ్యాప్తంగా 130 నగరాల్లోని వాణిజ్య సముదాయాల కార్యకలాపాలను జేఎల్‌ఎల్‌ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత హైదరాబాద్‌కు ప్రథమస్థానాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ రూపొందించిన ‘సిటీ మూమెంటమ్‌ ఇండెక్స్‌-2020’ని తెలంగాణ మంత్రి కేటీఆర్, జేఎల్‌ఎల్‌ సీఈవో రమేశ్‌ నాయర్‌, జీహెచ్‌ఎంసీ బొంతు రామ్మోహన్‌ తదితరులతో కలిసి శనివారం రాత్రి విడుదల చేశారు.అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ నగరాల జాబితాలో హైదరాబాద్‌ మూడేండ్లలో రెండుసార్లు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. 

ఈ ఏడాది టాప్‌-10లో హైదరాబాద్‌ తర్వాత బెంగళూరు, హోచిమిన్‌ సిటీ, నైరోబీ, చెన్నై, ఢిల్లీ, హనోయి, మనిలా, సిలికాన్‌వ్యాలీ, షెన్‌జెన్‌ నగరాలు చోటుదక్కించుకోగా.. పుణె 12వ, కోల్‌కతా 16వ, ముంబై 20వ స్థానంలో నిలిచాయి. 2014లో జేఎల్‌ఎల్‌ విడుదలచేసిన సిటీ ఇండెక్స్‌లో హైదరాబాద్‌కు టాప్‌-20లో చోటు లభించలేదు. ఆ మరుసటి ఏడాదే టాప్‌-20లో చేరిన హైదరాబాద్‌.. అప్పటినుంచి తన స్థానాన్ని మెరుగుపరుచుకొని 2016లో ఐదో స్థానానికి 2017లో మూడో స్థానానికి, 2018లో అగ్రస్థానానికి ఎగబాకింది.

గతేడాది ఈ సూచీలో హైదరాబాద్‌ రెండో స్థానానికి పడిపోయినా ఈ ఏడాది మళ్లీ మొదటిస్థానం దక్కించుకున్నది.గతేడాది ఈ ఇండెక్స్‌లో మొదటి స్థానాన్ని దక్కించుకొన్న బెంగళూరును ఈసారి హైదరాబాద్‌ రెండోస్థానానికి నెట్టేసింది. సూచిక ప్రారంభించినప్పటి నుంచి తమ అధ్యయనంలో చైనా పనితీరు తగ్గుతోందని నివేదిక తెలిపింది.