ఎన్‌కౌంటర్‌లతో న్యాయం జరగదు.. అఘాయిత్యాలు ఆగవు: యాసిడ్ బాధితురాలు ప్రణీత

  • Published By: vamsi ,Published On : December 7, 2019 / 06:00 AM IST
ఎన్‌కౌంటర్‌లతో న్యాయం జరగదు.. అఘాయిత్యాలు ఆగవు: యాసిడ్ బాధితురాలు ప్రణీత

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ అత్యాచారం, హత్య ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దిశను ఎక్కడైతే, కాల్చేశారో.. అక్కడే ఎన్‌కౌంటర్ చేసి చంపేశారు పోలీసులు.  దేశంలో ఉన్న చట్టాలు నిందితులకు భయం పుట్టించలేదు. అయితే ఇన్‌స్టంట్‌గా న్యాయం చేశారు పోలీసులు. సీపీ సజ్జనార్ కెరీర్‌లో ఇలాంటి సంచలన ఎన్‌కౌంటర్ చేయడం ఇది రెండో సారి. 2008లో వరంగల్ ఎస్పీగా ఉన్నప్పుడు కూడా.. ఇలాంటి సంచలనాత్మక ఘటన చోటుచేసుకుంది. అదే యాసిడ్ దాడి.

వంరగల్‌లో స్వప్నిక, ప్రణీత అనే యువతులపై శ్రీనివాస్ అనే వ్యక్తి యాసిడ్ దాడి చేశాడు. అతనికి మరో ఇద్దరు సహాయం చేశారు. ఈ ఘటన 2008 డిసెంబరు 10వ తేదీన జరిగింది. ఈ ఘటనలో స్వప్నిక మరణించగా.. ప్రణీత ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం అమెరికాలోని కొలరాడోలో నివసిస్తున్న ప్రణీత మహిళలపై అత్యాచారాలకు, దాడులకు పాల్పడిన వారిని ఎన్‌‌కౌంటర్ చేయడం వల్ల న్యాయం జరగదు అంటూ చెప్పుకొచ్చింది.

చట్టపరంగా వారిని కఠినంగా శిక్షించడమే ఇటువంటి సమస్యకు పరిష్కారం ప్రణీత తన అభిప్రాయం వ్యక్తం చేసింది. తమపై యాసిడ్‌ దాడిచేసిన ముగ్గురు నిందితులను 2008లో ఎన్‌కౌంటర్‌ చేసినా కూడా.. ఇప్పటికీ న్యాయం జరిగిందనే భావన తనకు కలగట్లేదని వెల్లడించింది. ఎన్ కౌంటర్ చేసి చంపడం సరైన న్యాయం కాదని, మహిళలపై దాడులు జరగకుండా చూడటమే ప్రభుత్వం ఆడవాళ్లకు చేసే న్యాయం అని అన్నారు ప్రణీత. 

అప్పుడు జరిగిన ఎన్‌కౌంటర్‌ తనను ఇప్పటికీ నీడలా వెంటాడుతూనే ఉందని అన్నారు ఆమె. ‘‘నేనొక సాదాసీదా కాలేజీ విద్యార్థిని. క్లాసులకు వెళ్లి స్నేహితురాలు స్వప్నికతో కలిసి స్కూటర్‌పై తిరిగొస్తుండగా మాపై యాసిడ్‌ దాడి జరిగింది. నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడే ముగ్గురు నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగింది. వారి చావులకు మీరు కారణం అయ్యారని ఎవరైనా అంటే నేనేం తప్పుచేశాను అని బాధ కలిగుతుంది. ఎన్‌కౌంటర్‌ మరణాలు మీలో ఆత్మస్థైర్యాన్ని పెంచాయా? అని అడిగితే ఎన్‌కౌంటర్‌ గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఆ మాట వింటే నాకు భయం వేస్తుంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‍‌‌కౌంటర్ వల్ల న్యాయం జరుగుతుంది అనేది భావోద్వేగంలో వచ్చే అభిప్రాయం మాత్రమే.

ఎన్‌కౌంటర్ వంటి  చర్యల వల్ల ఏ న్యాయమూ జరగలేదు. నా ముఖం, చర్మం సాధారణ స్థితికి వచ్చినపుడు, నేను మామూలు జీవితం గడిపినప్పుడు మాత్రమే నాకు న్యాయం జరిగినట్లు. వాళ్లు ఎన్‌కౌంటర్లో చనిపోయినా.. నేను మాత్రం ఆ సంఘటన తర్వాత ఇప్పటికీ కుమిలిపోతూనే ఉన్నా. నా చర్మానికి మొత్తం 14 సర్జరీలు అయ్యాయి. కొద్దిరోజుల్లోనే జీవితం పూర్తిగా మారిపోయింది. ఫొటో తీసుకున్నా.. అద్దం ముందు నిలబడినా.. నాటి సంఘటన కచ్చితంగా గుర్తుకు వస్తుంది. కాకతీయ యూనివర్శిటీ నుంచి బీటెక్ పరీక్షల్లో 82శాతం మార్కులతో పాసయ్యా. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం వచ్చింది. అప్పటికీ నా జీవితం సాధారణ స్థితికి రాలేదు. నేనొకసారి విదేశీ బిజినెస్‌ ట్రిప్‌కు వెళ్లాల్సి వస్తే ‘మీరు శారీరకంగా ఫిట్‌గానే ఉన్నారా?’ అని టీం లీడర్‌ అడిగితే.. ఆయనతో నేను గొడవపడ్డా’’ అని తెలిపారు ప్రణీత. 

మేము కాలేజ్‌‌లో ఉన్న సమయంలోమ స్వప్నికకు ఆ వ్యక్తి ప్రపోజ్ చేశాడు. దానిని ఆమె రిజెక్ట్ చేసింది. తర్వాత దానిని పట్టించుకోలేదు. అతను మాత్రం కోపంతో బైక్ నడుపుతున్న సమయంలో మా దగ్గరకు మరో ఇద్దరితో కలిసి వచ్చి యాసిడ్ పోశాడు. అది ఇద్దరి మీద పోశాడు. తర్వాత ఒక ఆటో అతను మా ఇద్దరిని దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లాడు. అప్పుడు పోలీసులకు ఫోన్ చెయ్యాలా? పేరంట్స్ కి ఫోన్ చెయ్యాలా? అనే ఆలోచన రాలేదు. భయంగానే ఉన్నాం అని చెప్పారు. ఓ నాయకుడు పోలీసులకు ఫోన్ చేయాలని సూచించినదానికి సమాధానంగా ఈ విషయం చెప్పారు ప్రణీత.

దిశ తన చెల్లెలు మాట విని టోల్ గేట్ దగ్గరకు వెళ్లి ఉంటే మాత్రం ఈ రోజు బతికి ఉండేదనే అభిప్రాయం వ్యక్తం చేసింది ప్రణీత. సమాజంలో చాలామంది దాడిచేసినా తమను ఎవరూ పట్టుకోలేరులే అని, ఒకవేళ దొరికినా బెయిల్‌పై బయటికి రావచ్చులే అనే ధీమాతో నేరాలు చేస్తారని ప్రణీత అన్నారు. ఏ విషయంలో అయినా పోలీసులు వెంటనే స్పందిస్తే.. ఈ ఘోరాలు జరిగేవి కాదని అన్నారు. యాసిడ్ దాడి జరిగిన సమయంలో కూడా స్వప్నిక పోలీసు కంప్లైంట్ ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. నిందితులకు వ్యతిరేకంగా పోలీసులు గట్టి సాక్ష్యాలు సేకరించాలని, ప్రతి కేసుపైనా పకడ్బందీగా విచారణ చేస్తే, చట్టానికి గంతలు లేవు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే నేరాలు ఆగిపోతాయని ఆమె అన్నారు.