పెళ్లి బరాత్‌లో తుపాకి, కత్తులతో డ్యాన్స్‌లో హంగామా…

పెళ్లి బరాత్‌లో తుపాకి, కత్తులతో డ్యాన్స్‌లో హంగామా…

Hyderabad groom dance with pistol in marriage barath : పెళ్లి బారాత్ లలో భారీ కత్తులతోను..తుపాకుల కాల్పులతోను హంగామాలు సృష్టించటం సర్వసాధారణంగా మారిపోయింది. పెళ్లి సందడి పేరుతో జరిగిన ఇటువంటి ఘటనలతో కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా లేకపోలేదు. అయినాసరే తుపాకీలతో..కత్తులతో చేసే హంగామాలు మానటంలేదు. ఈక్రమంలో హైదరాబాద్‌లోని ఓ పెళ్లి బరాత్‌లో కత్తులు, తుపాకితో డ్యాన్స్‌లు చేస్తున్న దృశ్యాలు మరోసారి హల్ చల్ చేశాయి.

శుభకార్యాల్లో కత్తులు, తుపాకులతో హంగామాలు చేయటంపై నిషేధం ఉన్నాగానీ హైదరాబాద్ లో తాజాగా జరిగిన ఓ పెళ్లి వేడుకలో వరుడితో పాటు అతని స్నేహితులు కత్తులు, తుపాకులతో చేసిన హంగామాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బండ్లగూడ మండలం మహ్మద్‌నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఆమెర్ షరీఫ్ అనే యువకుడికి మోయిన్‌బాగ్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లోగురువారం (డిసెంబర్ 17,2020) రాత్రి జరిగింది. పెళ్లికి వెళ్లడానికి ముందు ఇంటి వద్ద బరాత్ నిర్వహించారు.

ఈ బారాత్ లో పాల్గొన్న వరుడు ఆమెర్ షరీఫ్, అతని స్నేహితులు కత్తులు ఊపుతూ డ్యాన్స్ చేశారు. స్నేహితుడు ఇచ్చిన తుపాకి పట్టుకుని వరుడు ఆమెర్ చిందేసాడు..ఆమెర్ తో పాటు అతడి సోదరుడు మహ్మద్ ఇమ్రాన్ షరీఫ్, స్నేహితులు జబ్బార్, మహ్మద్‌లు కత్తులతో డ్యాన్స్ చేశారు.

ఈ దృశ్యాలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ఈ వీడియో చాంద్రాయణగుట్ట పోలీసుల దృష్టికి చేరింది.దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆమెర్, ఇమ్రాన్ , జబ్బార్
తదితరులపై కేసులు నమోదు చేశారు.

అనంతరం వారి నుంచి తుపాకి, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. కత్తులు నిజమైనవే గానీ తుపాకి మాత్రం బొమ్మదని పోలీసులు తెలిపారు.