నగరంలో వదలని వాన : జనజీవనం అస్తవ్యస్తం

  • Published By: madhu ,Published On : September 26, 2019 / 12:47 AM IST
నగరంలో వదలని వాన : జనజీవనం అస్తవ్యస్తం

భాగ్యనగరంలో వరుణుడు దంచి కొట్టాడు. కుండపోత వానతో నగరం వణికపోయింది. ఆగకుండా రెండు గంటలపాటు వర్షం కురవడంతో జనజీవనం అతలాకుతలమైంది. కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో వాహనదారులు నరకం అనుభవించారు. సెప్టెంబర్ 25వ తేదీ బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎడతెరపి లేకుండా వర్షం పడింది. అధిక వర్షాలతో హైదరాబాద్‌ నగర జనజీవనం అతలాకుతలమైంది. చాలా ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.

భారీగా ట్రాఫిక్‌ జాం కావడంతో ఇళ్లకు వెళ్లేందుకు గంటలకొద్దీ ప్రయాణించాల్సి వచ్చింది. రోడ్లపై నిలిచిన నీటిని పారదోలేందుకు ట్రాఫిక్‌ పోలీసులు, జీహెచ్‌ఎంసీ కార్మికులు శ్రమించారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున 5 గంటల వరకు క్యుములోనింబస్‌ మేఘాలు ప్రభావంతో ఆకాశానికి చిల్లు పడినట్లయింది. హైదరాబాద్‌లోని శ్రీనగర్‌కాలనీ, గణాంక భవన్, సెస్, మణికొండ, విజయనగర్‌ కాలనీలోని ఫుట్‌బాల్‌ గ్రౌండ్, కవాడిగూడ, రెడ్‌హిల్స్‌లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా సరాసరి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ అధికారులు తెలిపారు. 2017 సెప్టెంబర్‌ 14న మల్కాజిగిరిలో 20 సెంటీమీటర్ల వర్షం కురిసిందని చెప్పారు.

బుధవారం రాత్రి కురిసిన వర్షానికి కిషన్‌బాగ్‌లో ఇంటి గోడ కూలి ఓ వృద్ధురాలు మృతి చెందింది. 65 వయసున్న మన్సూర్‌బేగం  మహమూద్‌నగర్‌లో కుమారుడు ఫైజల్, కోడలితో కలసి నివసిస్తోంది. మూసీ నాలా చివరన ఉన్న వారి ఇంటి గోడలు రెండ్రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బాగా తడిసి… నిన్న రాత్రి 7 గంటలకు కుప్పకూలి మన్సూర్‌బేగంపై పడ్డాయి. ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఎంజే మార్కెట్‌ దగ్గర భారీ వర్షానికి వరద పోటెత్తింది. నడిరోడ్డు వరద గోదావరిని తలపించింది.

ప్రవాహం ధాటికి వాహనాలు రోడ్లుపై కొట్టుకుపోయాయి. వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించిన వాహనదారులు కూడా… నీళ్లలో కొట్టుకుపోయారు. రాజధానిలో కురిసిన భారీ వర్షాలకు మెట్రో రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం కలిగింది. ఎల్బీనగర్‌ – మియాపూర్‌ మార్గంలో సుమారు 30 నిమిషాల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆటోమేటిక్‌ విధానంలో కాకుండా.. మాన్యువల్‌గా నడపడంతోనే రైళ్లు కాస్త ఆలస్యంగా నడిచినట్లు మెట్రో రైలు అధికారులు వెల్లడించారు. రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ జాం కావడంతో మెట్రోలో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఎగబడ్డారు. దీంతో ఒక్కసారిగా మెట్రో రైళ్లు కిక్కిరిసిపోయాయి.
Read More : రెయిన్ ఎఫెక్ట్ : మెట్రో సర్వీసులకు అంతరాయం