మెట్రో ప్రయాణం కంటే పార్కింగ్ ఛార్జీలే ఎక్కువ

మెట్రో ప్రయాణం కంటే పార్కింగ్ ఛార్జీలే ఎక్కువ

మెట్రో ద్వారా ప్రయాణికులకు మెరుగైన, సుఖవంతమైన ప్రయాణ సదుపాయం లభిస్తున్నప్పటికీ పార్కింగ్ రేట్లు మాత్రం వాహనదారులకు షాకిస్తున్నాయి. ఉదాహరణకు మెట్రో ప్రారంభమైన తొలినాళ్లలో బేగంపేట్ స్టేషన్లో వాహనాలకు పార్కింగ్ ఫీజును వసూలు చేయలేదు. ఏడాది తర్వాత నామమాత్రంగా రోజంతా బండి పిలిపితే రూ.10తీసుకునే వారు. ఇప్పుడు ద్విచక్రవాహనానినికి 2గంటలకు రూ.5, 3గంటలకు రూ.10చొప్పున గుంజుతున్నారు. 5గంటల పాటు పార్కింగ్ చేస్తే బైక్ కు రూ.15 చొప్పున చెల్లించాలి. ఉదయం 6 నుంచి రాత్రి 10వరకు ద్విచక్రవాహనం పార్కింగ్ లో ఉంచితే రూ.20చెల్లించాల్సిందే.

ఇక కార్లకైతే పార్కింగ్ ఫీజులు బెంబేలెత్తిస్తున్నాయి. కనిష్టంగా 2గంటలకు రూ.15చొప్పున వసూలు చేస్తుండగా, గరిష్ఠంగా ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిలిపే వాహనాలకు రూ.50 వరకు చదివించుకోవాల్సి వస్తోంది. ఒక్క బేగంపేట్ స్టేషన్ లోనే కాకుండా నగరంలోని దాదాపు అన్ని మెట్రో స్టేషన్లో ఇదే పరిస్థితి ఉంది. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకూ 29కి.మీ మార్గంలో, నాగోల్ నుంచి హైటెక్ సిటీ వరకూ 28కి.మీ మార్గంలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. 

ఈ రెండు మార్గాల్లో 50స్టేషన్లు ఉండగా వీటిలో సుమారు 30స్టేషన్లలో పార్కింగ్ సదుపాయం ఉండేది. కానీ, ఇప్పుడు అన్ని చోట్లా పెయిడ్ పార్కింగ్ గా మార్చడం గమనార్హం. మెట్రో రైళ్లలో ప్రతిరోజూ సుమారు 3.5లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీరిలో చాలా మంది సొంత వాహనాల్లో మెట్రో స్టేషన్ వరకూ వచ్చి అక్కడ పార్కింగ్ చేసి కార్యాలయాలకు వెళ్తున్నారు. ఇలా వస్తున్న వారంతా మెట్రో ప్రయాణ ఛార్జీ కంటే వాహనాల పార్కింగ్ ఛార్జీలే ఎక్కువవుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.