కరోనాను పట్టించుకోరా? పిల్లల ప్రాణాలతో ప్రైవేట్ స్కూల్స్ చెలగాటం, అనుమతి లేకుండానే ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఓపెన్

కరోనాను పట్టించుకోరా? పిల్లల ప్రాణాలతో ప్రైవేట్ స్కూల్స్ చెలగాటం, అనుమతి లేకుండానే ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఓపెన్

Hyderabad Private Schools Negligence: కరోనా ప్రాణాంతక వైరస్. ఏడాది కాలంగా వింటున్న మాట ఇది. ప్రపంచవ్యాప్తంగా 10కోట్ల 50లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. 22లక్షల మంది ప్రాణాలను కబళించింది కరోనా వైరస్. అంతటి ప్రాణాంతక వైరస్ కాబట్టే, దేశ విదేశాల్లో విద్యా సంస్థలు మూతపడ్డాయి. తెలంగాణలోనూ ఇదే జరిగింది. 2020 మార్చి నుంచి స్కూళ్లను మూసేశారు.

కాగా, పరిస్థితిలో కొంత మార్పు రావడంతో, 2022 ఫిబ్రవరి 1 నుంచి 9 ఆపై తగరతుల విద్యార్థులకు స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నాయి. వాటికి మాత్రమే అనుమతి ఇచ్చారు. అయితే ప్రీ ప్రైమరీ స్కూళ్లకు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. కానీ పర్మిషన్ లేకుండానే హైదరాబాద్ లో ప్రీ పైమరీ స్కూళ్లను నడిపిస్తున్న ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. అది కూడా కొవిడ్ నిబంధనలకు పాతరేసి. పిల్లలకు మాస్క్ లేదు, భౌతిక దూరం అసలే లేదు. కోవిడ్ ఉన్నా స్కూల్ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

విద్యాశాఖ అనుమతి లేకుండా ప్రీ ప్రైమరీ, ప్రైమరీ స్కూళ్లు తెరవడం నేరం. సహజంగానే రాష్ట్ర రాజధాని కావడంతో హైదరాబాద్ లోని స్కూళ్లపై పటిష్ట నిఘానే ఉంటుంది. కాగా, పాతబస్తీలో ఓ ఇంటర్నేషనల్ స్కూల్ ని ఇష్టారాజ్యంగా తెరిచారు. చిన్న పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది ఈ ప్రైవేట్ స్కూల్. ఈ స్కూల్ కి వచ్చిన చిన్నారుల్లో చాలామందికి మాస్కులు లేవు. భౌతికదూరం పాటిస్తున్నారా అంటే అదీ లేదు.

కేవలం కాసులు దండుకోవడం కోసం స్కూల్ తెరిచేసింది యాజమాన్యం. పైగా అందరిని గుంపులు గుంపులుగా కూర్చోబెట్టేశారు. అసలు అనుమతి లేనిది స్కూల్ ఎలా తెరిచారని ప్రశ్నిస్తే.. బుకాయించే ప్రయత్నం చేసింది యాజమాన్యం. ఈ వ్యవహారం విద్యాశాఖ దృష్టికి వెళ్లింది. దీంతో ఆ స్కూల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది.

* పిల్లల ప్రాణాలతో ప్రైవేట్ స్కూల్స్ చెలగాటం

* కోవిడ్ ను పట్టించుకోని యాజమాన్యాలు

* కోవిడ్ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘన

* మాస్కులు లేవు, భౌతిక దూరం అసలే లేదు

* గుంపులు గుంపులుగా పిల్లలను కూర్చోబెట్టారు

* హైదరాబాద్ పాతబస్తీలో ప్రైవేట్ స్కూల్ నిర్వాకం

* అనుమతి లేకుండానే ప్రీ ప్రైమరీ స్కూల్ ఓపెన్

* తల్లిదండ్రులూ జాగ్రత్త.. పిల్లల ప్రాణంకంటే ఏదీ ముఖ్యం కాదు