హైదరాబాద్ ప్రసంగం స్వామి వివేకానంద జీవితంలో ఓ మలుపు

హైదరాబాద్ ప్రసంగం స్వామి వివేకానంద జీవితంలో ఓ మలుపు

SWAMI VIVEKANANDA స్వామి వివేకానంద అమెరికాలోని చికాగో నగరానికి వెళ్లక ముందు 1893 ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు హైదరాబాద్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. స్వామి వివేకానంద నగర పర్యటన సందర్భాన్ని పురస్కరించుకుని..శనివారం సికింద్రాబాద్‌లోని మహబూబ్ కాలేజీలో ‘రామకృష్ణ మఠం’ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా మహబూబ్ కాలేజీలోని స్వామి వివేకానంద హాల్‌లో ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్వామిజీని స్మరిస్తూ ప్రత్యేక భజనలు చేశారు.

ఈ సందర్భంగా వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలన్స్(VIHE) డైరెక్టర్ స్వామి బోధమయానంద మాట్లాడుతూ.. స్వామి వివేకానంద బోధనలు నేటికీ అనుసరణీయమన్నారు. చికాగో నగరానికి స్వామిజీ వెళ్లకముందే … హైదరాబాద్‌లో 1893లో ఇదే రోజున ‘మిషన్ టు ది వెస్ట్’ పేరిట ఆయనిచ్చిన ప్రసంగం స్వయంగా స్వామిజీలో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింప చేసిందన్నారు. వెయ్యి మంది సభికుల ముందు ఆయనిచ్చిన ప్రసంగం ఎందరిలోనో స్ఫూర్తినింపిందన్నారు. ప్రసంగంలో భారత ఔన్నత్యాన్ని చాటడానికి అమెరికా వెళుతున్నానని స్వామిజీ తెలిపారని బోధమయానంద అన్నారు. చికాగోలో విశ్వవేదికపై సర్వమత ప్రతినిధుల సమావేశంలో స్వామిజీ భారతీయ ఆధ్యాత్మిక ఆత్మను ప్రపంచానికి పరిచయం చేశారన్నారు. స్వాస్వామి వివేకానంద వారం రోజుల పర్యటనను ప్రస్తుతానికి రామకృష్ణ మఠం నిర్వహిస్తున్నా.. వాస్తవానికి ప్రభుత్వాలే నిర్వహించాలని బోధమయానంద అన్నారు.

ఈ సందర్భంగా వలంటీర్ల ప్రసంగాలు సభికులను ఆకట్టుకున్నాయి. భాగ్యనగరంలో వివేకానంద’ పేరుతో రూపొందించిన వీడియోను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. రామకృష్ణ ప్రభ ఎడిటర్ స్వామి పరిజ్ఞేయానంద, స్వామి భీతిహరానంద, బ్రహ్మచారులు జైకృష్ణ, సవ్యసాచి, మహబూబ్ కాలేజ్ యాజమాన్యం, ప్రిన్సిపాల్ వేంకటేశ్వరరావు, ఇతర ప్రముఖులు, రామకృష్ణమఠం భక్తులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.