బిగ్ ఛాలెంజ్ : హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం పెంచడం ఎలా

  • Published By: veegamteam ,Published On : April 6, 2019 / 02:26 PM IST
బిగ్ ఛాలెంజ్ : హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం పెంచడం ఎలా

ఎక్కడ చూసినా జనమే కనిపిస్తారు. మామూలు రోజులే కాకుండా సెలవు రోజుల్లో కూడా రోడ్లు కిటకిటలాడుతుంటాయి. కానీ… ఎన్నికల సమయంలో మాత్రం జనం అస్సలు కనిపించరు. దీంతో.. హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఓవైపు పరీక్షలు.. రెండు రాష్ట్రాల్లో ఒకేసారి పోలింగ్ ఉండటంతో.. అధికారులు హైరానా పడుతున్నారు.

ఎన్నికల సమీపిస్తుంటే.. హైదరాబాద్ జిల్లా అధికారుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. జనాలను పోలింగ్ కేంద్రాలకు ఎలా రప్పించాలా అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. సాధారణంగా పోలింగ్ అంటే నేతలకు టెన్షన్ ఉండాలి. కానీ.. ఇప్పుడు మాత్రం అధికారులు హైరానా పడుతున్నారు. ఎందుకంటే.. ఏ ఎన్నిక జరిగినా 45 నుంచి 50 శాతమే పోలింగ్ జరుగుతుంది. దీంతో.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా పర్సెంటేజీని పెంచాలని హైదరాబాద్ జిల్లా అధికారులు డిసైడ్ అయ్యారు. పరీక్షల సీజన్ కావడం.. రెండు రాష్ట్రాల్లోనూ ఒకేసారి ఎన్నికల ఉండటం అధికారులకు సవాల్‌గా మారుతోంది.

హైదరాబాద్ జిల్లాలో 2 లోక్‌స‌భ స్థానాలున్నాయి. ఇప్పటికే జిల్లా అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో మునిగిపోయారు. నోటిఫికేషన్ విడుదలవడం ఆలస్యం… ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యల్లో నిమగ్నమయ్యారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, భధ్రత, ఈవీఎం, వీవీప్యాట్‌ల పరిశీలన, సిబ్బందికి శిక్షణపై దృష్టిపెట్టడమే కాకుండా.. ఓటర్ల తుది జాబితాపైనా కసరత్తు చేసారు.

వీటన్నింటితో పాటు.. పోలింగ్ శాతం ఎలా పెంచాలా అనే విషయంపైనా జిల్లా అధికారులు దృష్టిపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా… పర్సెంటేజీ మాత్రం పెంచలేకపోయారు. జిల్లా మొత్తంలో కేవలం 48శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈసారి కూడా తక్కువే అవుతుందేమో అని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు ఉన్నందున… హైదరాబాద్‌లో ఉంటున్న ఆంధ్ర, రాయలసీమ ప్రాంత ఓటర్లు తమ స్వగ్రామాలకు వెళ్లిపోయే అవకాశం ఉంది. దీంతో పోలింగ్ పర్సెంటేజీపై ప్రభావం పడొచ్చని అధికారులంటున్నారు.

హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 42 లక్షలకు పైగా ఓటర్లున్నారు. అందులో ఎక్కువ శాతం మంది స్వగ్రామాలకు వెళ్లిపోతే.. పరిస్థితి ఏంటా అని అధికారులు ఆలోచిస్తున్నారు. మరోవైపు.. ఓటర్లలో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. మహిళలు, దివ్యాంగుల ఓట్లు కీలకంగా మారే అవకాశం ఉంటుంది. సో వారిని పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మరి అధికారుల ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో చూడాలి.