ఒట్టేసి చెబుతున్నా : ప్రభాస్‌ని నా జీవితంలో కలవలేదు

  • Published By: veegamteam ,Published On : January 14, 2019 / 07:25 AM IST
ఒట్టేసి చెబుతున్నా : ప్రభాస్‌ని నా జీవితంలో కలవలేదు

హైదరాబాద్: వైసీపీ చీఫ్ జగన్ సోదరి, వైఎస్ షర్మిల సీఎం చంద్రబాబు, టీడీపీ నాయకులపై పైర్ అయ్యారు. సోషల్ మీడియాలో తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బాహుబలి ప్రభాస్‌తో తనకు సంబంధం ఉన్నట్టు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇలాంటివి పుట్టించి కొంతమంది ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు. దీని వెనుక టీడీపీ కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. తెలుగువారి ఆత్మ గౌరవం అంటూ డైలాగులు చెప్పే టీడీపీ నేతలకు ఆత్మగౌరవం ఉందో లేదో చెప్పాలన్నారు. చంద్రబాబు ఇంట్లో మహిళలు లేరా? అని నిలదీశారు. మేము దుష్ప్రచారం చేయలేమా? మాకు తెలివి లేదా? అని షర్మిల ఎదురుదాడికి దిగారు. మాకు విలువలు ఉన్నాయి అందుకే అలాంటి పని చేయడం లేదని షర్మిల చెప్పారు. పుకార్లు పుట్టించి వ్యక్తిత్వాన్ని చంపడం దారుణం అన్నారు.

బాహుబాలి ప్రభాస్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని షర్మిల స్పష్టం చేశారు. నా పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. జీవితంలో ప్రభాస్ అనే వ్యక్తిని ఎప్పుడూ కలవలేదని షర్మిల అన్నారు. ప్రభాస్‌తో నాకు సంబంధం ఉందనే ప్రచారం వెనుక టీడీపీ కుట్ర ఉందని షర్మిల ఆరోపించారు. సోషల్ మీడియాలతో తన గురించి అసభ్యకర పోస్టులు పెడుతున్నారని షర్మిల సీపీకి ఫిర్యాదు చేశారు. అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిని, వారి వెనకాల ఉన్నవారిని గుర్తించి శిక్షించాలని షర్మిల డిమాండ్ చేశారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేకనే తాను హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశానని షర్మిల చెప్పారు. దీన్ని తన వ్యక్తగత విషయంగా చూడకుండా మహిళల ఆత్మగౌరవం అంశంగా చూడాలని సీపీని షర్మిల కోరారు. దోషులపై చర్యలు తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చారని షర్మిల చెప్పారు. రాజకీయాల కోసం ఈ స్థాయికి దిగజారిపోవడం దారుణం అన్నారు.

2014 ఎన్నికల సమయంలోనూ ఇలాంటి దుష్ప్రచారం చేసి తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశారని షర్మిల అన్నారు. ఒక వర్గానికి చెందిన వారు క్యాంపెయిన్‌లా తన గురించి ప్రచారం చేశారని చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశానని, పోలీసులు యాక్షన్ తీసుకోవడంతో కొంతకాలం దుష్ప్రచారం ఆగిందని, మళ్లీ ఇప్పుడు ఎన్నికల సమయం రావడంతో విష ప్రచారానికి మళ్లీ వేగం పెంచారని చెప్పారు. ఒక తల్లిగా, చెల్లిగా నా నైతికతను, నా నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు. నా గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, అందుకే అందరి ముందుకు వచ్చానని, ప్రభాస్‌తో ఎలాంటి రిలేషన్ లేదని షర్మిల తేల్చి చెప్పారు. ఇదే నిజం అని పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పారు.