సంక్రాంతికి ఊరెళ్తే.. సమాచారం ఇవ్వండి

సంక్రాంతి పండుగుకు సొంతూళ్లకు వెళ్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ సూచించారు.

  • Published By: veegamteam ,Published On : January 10, 2019 / 03:37 AM IST
సంక్రాంతికి ఊరెళ్తే.. సమాచారం ఇవ్వండి

సంక్రాంతి పండుగుకు సొంతూళ్లకు వెళ్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ సూచించారు.

హైదరాబాద్‌ : సంక్రాంతికి మీరు సొంతూళ్లకు వెళ్తున్నారా..? అయితే పోలీసులకు చెప్పి వెళ్లండి. ఎందుకంటారా…మీ ఇల్లు గుల్ల కాకుండా ఉండేందుకు. మళ్లీ మీరు తిరిగి వచ్చే వరకు మీ ఇంటికి రక్షణగా ఉంటారు. సంక్రాంతి పండుగుకు సొంతూళ్లకు వెళ్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ సూచించారు. నగరం, శివార్లలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని అంతర్రాష్ట్ర ముఠాలు చోరీలకు పాల్పడుతున్నాయన్నారు. గత అనుభవాల దృష్ట్యా ఎక్కడా దొంగతనం జరగకుండా చూసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జనవరి 9, బుధవారం రోజున ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఊళ్లకు వెళ్లేవారు సంబంధిత సెక్టార్‌ ఎస్సైకి చెబితే… రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ పెంచడంతో పాటు ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తారని పేర్కొన్నారు. అదే సమయంలో ఇరుగు పొరుగు వారికి కూడా చెప్పి వెళ్లాలని చెప్పారు.

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నేరాలను నియంత్రణకు జోనల్‌ కంట్రోల్‌రూంలను త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. వీటి ద్వారా ఎప్పటికప్పుడు పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించడంతో పాటుగా.. ప్రతి పోలీస్‌ స్టేషన్ పరిధిలో విధుల నిర్వహణపై సమీక్ష చేసుకొనే వీలుంటుందన్నారు. గొలుసు చోరీల కట్టడికి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. దొంగతనాలు, గొలుసు చోరీలను అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని చెప్పారు. గతేడాది 30 శాతం స్నాచింగ్‌ కేసులు తగ్గాయని వివరించారు. తాజాగా వరుస చెయిన్‌ స్నాచింగ్‌లు నమోదవుతున్న దృష్ట్యా నేరగాళ్ల ఆటకట్టించేలా ప్రత్యేక డ్రైవ్‌ ప్రారంభిస్తామని తెలిపారు.

నేరస్థులు తప్పించుకోలేరు… అందుబాటులో అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల ఏర్పాటుతో నిందితులు, కరడుగట్టిన నేరస్థులను అరెస్ట్‌ చేస్తున్నామని కమిషనర్‌ చెప్పారు. 11 చోట్ల స్నాచింగ్‌లకు పాల్పడ్డ దొంగలనూ సీసీ కెమెరాల ఫుటేజీతోనే పట్టుకున్నామన్నారు. నేరాలు చేసేందుకు వచ్చిన అంతర్రాష్ట్ర నేరస్థులతో సహా ఎవరైనా.. తప్పించుకోలేరని అన్నారు.