తెలంగాణలో మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

  • Published By: madhu ,Published On : September 1, 2019 / 01:24 AM IST
తెలంగాణలో మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

రానున్న మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలలో సెప్టెంబర్ 01 ఆదివారం, సెప్టెంబర్ 02 సోమవారం ఒకటి రెండుచోట్ల, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవొచ్చని చెప్పింది. దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. రాగల 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. 

అల్పపీడనం క్రమంగా బలపడే సూచనలున్నయని ఐఎండీ నివేదికలో పేర్కొంది. ఉత్తర ఛత్తీస్ గడ్, దాన్ని ఆనుకుని తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపు వంగి ఉంది. 

ఆగస్టు 30వ తేదీ శుక్రవారం సుల్తానాబాద్, పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షం కురిసింది. జోగిపేటలో 8 సెం.మీ, సంగారెడ్డిలో 7 సెం.మీ. కానీ ఆగస్టు 31వ తేదీ శనివారం ఖమ్మంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది. 35 డిగ్రీల టెంపరేచర్ ఉంది. ఆదిలాబాద్ లో 34.6, రామగుండంలో 34, మహబూబ్ నగర్‌లో 33.3, భద్రాచలంలో 33.2, నిజామాబాద్‌లో 33, హన్మకొండలో 32.5, మెదక్‌లో 31.2, హకింపేటలో 30.8, నల్గొండలో 30.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.