వార్నింగ్ : 28, 29 తేదీల్లో ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

  • Published By: madhu ,Published On : April 27, 2019 / 01:50 AM IST
వార్నింగ్ : 28, 29 తేదీల్లో ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

ఏప్రిల్ 28, 29 తేదీల్లో బయటకు వెళుతున్నారా..అయితే జాగ్రత్త అంటోంది వాతావరణ శాఖ. ఎందుకంటే..రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు విపరీతంగా ఉంటాయని..వడగాలులు తీవ్రంగా వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పగటి వేళల్లో వీచే వేడి గాలులు తీవ్రస్థాయిలో ఉంటాయని ముందస్తుగా హెచ్చరించింది. ఉత్తర దిశ నుండి వీస్తున్న పొడిగాలుల కారణంగా గాలిలో తేమ 43 శాతం కంటే తగ్గడంతో వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 

మరో వైపు ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల మేర టెంపరేచర్స్ నమోదయ్యాయని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 26వ తేదీ శుక్రవారం అత్యధికంగా నిజామాబాద్ జిల్లా కోరట్ పల్లి మంచిప్పలో 45.5 డిగ్రీలు, మోర్తాడ్‌‌లో 45.3, లక్ష్మాపూర్, ఆదిలాబాద్ జిల్లా బేల, జైనథ్‌లో 45.4, నిజామాబాద్‌లో 44.7 డిగ్రీలు, రామగుండంలో 44, హైదరాబాద్‌లో 41.2 డిగ్రీలు నమోదయ్యాయని తెలిపింది. 

వాయువ్య భారతంలోని రాజస్థాన్ నుండి విదర్భ మీదుగా తెలంగాణ వైపు పొడిగాలులు వీస్తున్నాయి. దీని వల్ల తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎండలు అధికంగా ఉండడం..వడగాలులు వీస్తాయని తెలిపింది. మధ్యాహ్న సమయంలో బయట తిరగకపోవడమే బెటర్ అని సూచిస్తున్నారు. మరోవైపు హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని ఉన్న బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్‌గా మారనుందని వాతావరణ కేంద్రం తెలిపింది.