టీఎస్‌ఐపాస్ : తెలంగాణలో పారిశ్రామిక విప్లవం

తెలంగాణ పారిశ్రామికంగా దూసుకుపోతోంది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తున్నాయి.

టీఎస్‌ఐపాస్ : తెలంగాణలో పారిశ్రామిక విప్లవం

Telangana

తెలంగాణ పారిశ్రామికంగా దూసుకుపోతోంది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తున్నాయి.

హైదరాబాద్ : తెలంగాణ పారిశ్రామికంగా దూసుకుపోతోంది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తున్నాయి. రాష్ట్రంలో టీఎస్‌ఐపాస్ ప్రారంభమయ్యాక ఇప్పటివరకు మొత్తం 9395 పరిశ్రమలు అనుమతులు పొందాయి. వీటి ద్వారా రాష్ట్రానికి రూ.1.58 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. పరిశ్రమలన్ని ప్రారంభమయ్యాక 15.28 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే వినూత్నంగా 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతి ఇచ్చే విధానాన్ని సీఎం కేసీఆర్ తీసుకొచ్చారు. గతంలో పరిశ్రమల అనుమతులకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగాల్సి వచ్చేది. కోట్లలో పెట్టుబడులు పెట్టేవారికి ఎదురవుతున్న సమస్యలపై పారిశ్రామికవేత్తలు తీవ్ర ఆవేదన, అసంతృప్తికి లోనయ్యేవారు. అలాంటి ఇబ్బందులను తొలిగించి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి ఆకట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌ఐపాస్ (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం)ను తీసుకొచ్చింది. ఫలితంగా పరిశ్రమలకు అనుమతులు సులభతరమయ్యాయి.

దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు లభిస్తున్నాయి. ఒకవేళ 15 రోజుల్లో అనుమతి ఇవ్వకుంటే 16వ రోజున అనుమతి ఇచ్చినట్లుగానే భావించేట్లుగా నిబంధనలను రూపొందించారు. ఈ విధానంపై అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల ప్రతినిధులు ప్రశంసల వర్షం కురిపించారు. టీఎస్‌ఐపాస్‌ను చూసి పలువురు పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. ఇతర రాష్ట్రాల్లో తమ యూనిట్లకు అనుమతి పొందడానికి నెలల కొద్దీ సమయం పట్టిందని, కానీ తెలంగాణలో 15 రోజుల్లోనే అనుమతులు రావడం నిజంగా ఆశ్చర్యంగా, సంతోషంగా ఉన్నదని వారు సంతృప్తి వ్యక్తం చేశారు. పరిశ్రమల పెట్టుబడుల ద్వారా రాష్ట్రానికి గణనీయంగా ఆదాయం పెరుగుతూ వస్తున్నది. ఉపాధి అవకాశాలు పెంపొందుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రధాన అంశాల్లో ఉద్యోగ, ఉపాధి కల్పన ఒకటి. ప్రభుత్వం ఆ దిశగా దృష్టిసారించి ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువ సంఖ్యలో ఉంటాయి కాబట్టి పరిశ్రమల ద్వారా ప్రైవేటు ఉపాధి అవకాశాలకు ప్రయత్నిస్తున్నది.

పరిశ్రమలకు ప్రధానంగా అవసరమైన కరెంటు, భూమి, నీరు, అనుమతులు, మానవ వనరులు అన్నీ సులభంగా లభ్యమయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. టీఎస్‌ఐఐసీ ద్వారా భూమి కేటాయింపులు, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ సరఫరా, 15 రోజుల్లో అనుమతులు, మిషన్ భగీరథ ద్వారా పరిశ్రమలకు నీటి సరఫరా లభిస్తున్నాయి. మానవ వనరుల కోసం టాస్క్ ద్వారా శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇలా పరిశ్రమలకు అవసరమైన అన్నింటిని సమకూర్చుతుండటంతో జాతీయ,

అంతర్జాతీయ ప్రముఖ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు తమ యూనిట్లను విస్తరిస్తున్నాయి.
టీఎస్‌ఐపాస్ ద్వారా అనుమతి పొందినవాటిలో 6272 పరిశ్రమల ద్వారా ఇప్పటికే 2.74లక్షల మంది ఉపాధి అవకాశాలను పొందారు. త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతున్న పరిశ్రమల ద్వారా ఐదు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇంకా 1872 పరిశ్రమలు వాటి నిర్మాణపనులు ప్రారంభించాల్సి ఉంది. వీటి పనులు పూర్తైతే 7.44లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

రాష్ట్రవ్యాప్తంగా మేడ్చల్ జిల్లా అత్యధిక పరిశ్రమలతో ముందున్నది. ఈ జిల్లాలో 2432 పరిశ్రమలకు అనుమతులు వచ్చాయి. 796 పరిశ్రమలతో రంగారెడ్డి జిల్లా రెండోస్థానంలో నిలిచింది. సంగారెడ్డి జిల్లాకు 773 పరిశ్రమలొచ్చాయి. పెట్టుబడులపరంగా చూస్తే రంగారెడ్డి జిల్లాకు అత్యధికంగా రూ.40,038కోట్లు, ఆ తరువాత నల్లగొండ జిల్లాకు రూ.26,849కోట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రూ.20,925 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఉపాధి అవకాశాలపరంగా చూస్తే రంగారెడ్డి జిల్లాలో 6.12లక్షల మందికి, ఆదిలాబాద్ జిల్లాలో 4.01లక్షల మందికి, వరంగల్ రూరల్ జిల్లాలో 1.89లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.