చెత్తకుప్పలో పేలుడు..భయాందోళనలో స్థానికులు

  • Edited By: veegamteam , November 8, 2019 / 05:38 AM IST
చెత్తకుప్పలో  పేలుడు..భయాందోళనలో స్థానికులు

హైదరాబాద్ పరిధిలోని మీర్ పేటలో పేలుడు జరిగింది. విజయపురి కాలనీలోని ఓ చెత్తకుప్పలో పేలుడు.. స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. చెత్తను సేకరిస్తున్న ఓ మహిళ కుప్పలో ఉన్న ఓ డబ్బాను తీసింది. దాని మూత తీయటానికి ప్రయత్నించింది. అది రాలేదు. డబ్బాను నేలపై బలంగా కొట్టింది. దీంతో ఒక్కసారిగా ఆ డబ్బా పేలిపోయింది. ఈ ఘటనలో సదరు మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికులు హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. 

వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం డబ్బాను స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఆ డబ్బా ఎవరైనా కావాలనే ఇక్కడ పడేశారా? లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్, డాగ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగింది. ఆధారాలు సేకరిస్తున్నారు. పలువురు స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. భయాందోళనలు చెందవద్దని పోలీసులు భరోసా ఇస్తున్నారు. టిఫిన్ బాక్స్ లో బాంబ్ ఎలా వచ్చింది అనేది సీసీ కెమెరాల ద్వారా విచారణ చేపట్టారు.