కరోనా కట్టడికి ఐబీ సాయం

  • Published By: chvmurthy ,Published On : March 24, 2020 / 01:57 AM IST
కరోనా కట్టడికి ఐబీ సాయం

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ 19 (కరోనా వైరస్ ) కట్టడికి ప్రభుత్వం ఇంటిలిజెన్స్   సహకారం తీసుకుంటోంది. కరోనా వైర్స వ్యాప్తి సమయంలో విదేశాల నుంచి వచ్చి కూడా వారి వివరాలను ప్రభుత్వానికి వెల్లడించకుండా తప్పించుకు తిరుగుతున్న వారిని వెతికి పట్టుకోటానికి వైద్య ఆరోగ్య శాఖ ఐబీ సహకారం తీసుకుంటోంది.  కేంద్ర, రాష్ట్ర ఇంటిలిజెన్స్  బ్యూరో వర్గాలతో  ప్రజా ఆరోగ్య శాఖ అధికారులు సోమవారం ఉన్నత స్ధాయి సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశం వివరాలను గోప్యంగా ఉంచారు.

విదేశాల నుంచి వచ్చేవారు తమకు అందకుండా తిరుగుతున్నారని భావించిన వైద్య, ఆరోగ్యశాఖ పోలీసుశాఖ సాయం కోరింది. సోమవారం పోలీసుశాఖ ఉన్నతాధికారులతో వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పలుమార్లు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కూడా అన్ని శాఖలతోనూ సమన్వయం కోసం సుదీర్ఘంగా ఫోన్‌లో చర్చించారు.  

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ఇంటెలి జెన్స్‌ బృందాలు విదేశాల నుంచి వచ్చిన 18 వేల మంది వివరాలను సేకరించాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన వారందరి అడ్రస్‌లను గుర్తించాయి. ఇంకా ఎవరెవరు అందుబాటులో లేకుండా ఉన్నారన్న దాని పైనా ఇంటెలిజెన్స్‌ వర్గాలు జల్లెడ పడుతున్నాయి. ఎయిర్‌పోర్టు నుంచి జాబితా తీసుకొని వారిని గుర్తిస్తున్నాయి. గత 3 రోజుల్లోనే యూకే నుంచి ఏకంగా 100 మంది వచ్చారని ఒక ఇంటెలిజెన్స్‌ అధికారి తెలిపారు. 

మత ప్రచారం కోసం ఇండోనేసియా నుంచి వచ్చిన 10 మంది బృందం కరీంనగర్‌ వెళ్లిన విషయం తెలిసిందే. వారందరికీ కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన విషయమూ విదితమే. వారు ఈ రాష్ట్రంలో దాదాపు 300 మందితో కాంటాక్ట్‌ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే అత్యంత సన్నిహితంగా 37 మందితో మెలిగారు. వీరందరినీ వైద్య పర్యవేక్షణలోనూ, క్వారంటైన్‌లోనూ ఉంచారు. 

ఇప్పటివరకు వైద్య, ఆరోగ్యశాఖ కోఠిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనరేట్‌లో కమాండ్‌ కం ట్రోల్‌ రూంను ఏర్పాటు చేసి ఆ శాఖ అధికారులతో పర్యవేక్షణ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచే మంత్రి ఈటల రాజేందర్‌ వైద్యాధికారులతో పర్యవేక్షణ, సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కోవిడ్‌ కేసుల సంఖ్య పెరగడం, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం దీనిపైనే దృష్టిసారించడం, రాష్ట్రాన్ని లాక్‌డౌన్‌గా ప్రకటించడంతో ఇక అన్ని శాఖలను పర్యవేక్షించేందుకు సచివాలయంలో సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. కోవిడ్‌ బాధితులు తమ వివరాలు, సందేహాలు, సమాచారం కోసం ‘104’నంబర్‌కు ఫోన్‌ చేయాల్సి ఉంటుంది. వైద్య, ఆరోగ్యశాఖ ఇప్పుడు నిర్వహిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ రూం యథావిధిగా తన కార్యకలాపాలను నిర్వహిస్తుందని అధికారులు తెలిపారు. 

See Also | కరోనా రోగులకు.. ఫ్యాషన్‌ డిజైనర్‌ భారీ విరాళం