విద్యార్థి సంఘాల హర్షం : ఇంటర్ బోర్డు సెక్రటరీ బదిలీ

  • Published By: madhu ,Published On : September 21, 2019 / 12:45 AM IST
విద్యార్థి సంఘాల హర్షం : ఇంటర్ బోర్డు సెక్రటరీ బదిలీ

తెలంగాణ ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అశోక్ కుమార్‌పై ఎట్టకేలకు వేటు పడింది. ఇంటర్ అడ్మిషన్స్‌తో పాటు ఫలితాల వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే ఆరోపణలున్నాయి. 2019 మార్చ్‌లో జరిగిన ఇంటర్ ఎగ్జామ్స్ ఫలితాల విడుదలలో జరిగిన తప్పులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయిన సంగతి తెలిసిందే. ఫెయిల్ అయిన విద్యార్థుల్లో కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పమయ్యాయి. విద్యార్థి సంఘాలు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. 

ఇంటర్ విద్యార్థుల మార్కుల మెమోల్లో చిత్ర విచిత్రమైన కోడ్‌లు కనిపించాయి. మార్కులకు బదులు.. ఏపీ, ఏఎఫ్ అక్షరాలు కనిపించాయి. ఫెయిల్ అయిన విద్యార్థులు రీ వెరిఫికేషన్‌లో పాసవడం, ఎంఈసీ స్టూడెంట్స్‌ మార్కుల్లో తేడా రావడం,.. తెలుగులో జీరో మార్కులొచ్చినా రీవెరిఫికేషన్‌లో 99 రావడం లాంటి ఘటనలు అశోక్ హయాంలో జరిగాయి. విద్యార్థుల చావులపై అశోక్ చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేగింది. అంతే కాకుండా తప్పులు రెగ్యులర్‌గా జరుగుతాయంటూ వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. అధికారుల నిర్లక్ష్యంతోనే ఇంటర్ ఫలితాల్లో తప్పులు జరిగాయని ప్రభుత్వం వేసిన త్రిసభ్య కమిటీ రిపోర్ట్ ఇచ్చింది.

ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు ఎంత వత్తిడి తెచ్చినా అశోక్ కుమార్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా ప్రభుత్వం అశోక్ కుమార్‌ను బదిలీ చేసింది. ఆయన స్థానంలో 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి  సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ను బోర్డు కార్యదర్శిగా నియమించింది. బోర్డ్ కార్యదర్శిగా అశోక్‌ను తప్పించిన ప్రభుత్వం.. అతనికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. 

కానీ ..బాసర ట్రిపుల్ ఐటీ ఇన్‌ఛార్జ్ వీసీ పదవి నుంచి అశోక్‌ను ప్రభుత్వం తప్పించలేదు. అశోక్ హయాంలో ఆర్జీయూకేటీలో జరుగుతున్న అక్రమాలను 10tv బయటకు తెచ్చింది. యూనిఫామ్ నుంచి కంప్యూటర్లు, తాగు నీటి వరకు అనేక అంశాలకు సంబంధించిన టెండర్లలో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టింది. అడ్డంగా దొరికిపోయినా.. అతని అనుచరులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. మరి ఆర్జీయూకేటీ వీసీ పోస్టు ఉంటుందా.. ఊడుతుందో అనే విషయంపై కొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.