ఆసక్తికరంగా హుజూర్ నగర్ పాలిటిక్స్

  • Published By: veegamteam ,Published On : October 2, 2019 / 12:20 PM IST
ఆసక్తికరంగా హుజూర్ నగర్ పాలిటిక్స్

హుజూర్ నగర్ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. కంచుకోట లాంటి చోట కమ్యూనిస్టులు ఉనికిలో లేకుండా పోయారు. ఉప ఎన్నికల్లో సీపీఐ ఇప్పటికే టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించింది. సీపీఎం అభ్యర్థి శేఖర్ రావు నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీంతో బై పోల్ లో కామ్రేడ్లు పోటీకి దూరమయ్యారు. ఇది జిల్లాలో రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. బై ఎలక్షన్ లో టీడీపీ.. సీపీఎం మద్దతు కోరింది. తమకు మద్దతు ఇవ్వాలంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఫోన్ లో మాట్లాడారు. అయితే పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామని తమ్మినేని వీరభద్రం చెప్పారు. కాగా సీపీఎం అభ్యర్థి నామినేషన్ తిరస్కరణపై తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. 

మరోవైపు ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు మద్దతివ్వాలని టీజేఎస్ నిర్ణయం తీసుకుంది. అయితే కాంగ్రెస్ కు బయటి నుంచి మద్దతిస్తామని, వారితో కలిసి ప్రచారం చేయబోమని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పాలనకు చరమ గీతం పాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు ఇవ్వడం చారిత్రక తప్పిదమని విమర్శించారు.

హుజూర్ నగర్ లో నియంతకు, ప్రజాస్వామ్యానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని సీఎల్ పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. కాంగ్రెస్ మునిగిపోయే నావ అయితే కేటీఆర్ కు భయమెందుకని ప్రశ్నించారు. తమ భయం లేకుంటే 12 మంది శాసన సభ్యులను తీసుకునే వారే కాదన్నారు. టీఆర్ఎస్ ను రాష్ట్రం నుంచి నిర్మూలించే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని టీఆర్ఎస్ కు భయం పట్టుకుంది కాబట్టే మండలానికి ఓ మంత్రిని, గ్రామానికి ఒక ఎమ్మెల్యేని పెట్టారని ఎద్దేవా చేశారు. 

సీపీఐ పార్టీ నాయకత్వం వారికున్నవంటి ప్రత్యేక కారణాల చేత కాంగ్రెస్ పార్టీని వదిలేసి టీఆర్ ఎస్ పార్టీతో పోయినప్పటికీ కూడా సీపీఐ జెండాను మోస్తూ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్న ప్రతి ఒక్క ఓటర్, కార్యకర్తకు విజ్ఞప్తి చేశారు. మీ నాయకత్వం ఏ నిర్ణయం చేసినా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు మీరు మాత్రం ధీరోదాత్తలా కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. 

వామపక్షాలకు ఒకప్పుడు హూజూర్ నగర్ కంచుకోట అని చెప్పవచ్చు. ఒకే నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలున్న కాలంలో ఇటు పీడీఎఫ్ నుంచి వామపక్షాలు ప్రాతినిధ్యం వహించాయి. మిర్యాలగూడ శాసన సభ నియోజకవర్గం కింద హుజూర్ నగర్ నియోజకవర్గం ఉన్నన్ని రోజులు కూడా ఇక్కడి నుంచి ఎక్కువగా సీపీఎం అభ్యర్థులు గెలిచిన పరిస్థితి ఉంది. 2009లో హుజూర్ నగర్ ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ వామపక్షాలు కొంత తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం వామపక్షాల అభ్యర్థులే బరిలో లేని పరిస్థితి కనిపిస్తోంది. 

2009, 2014 ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా పోటీ చేసింది. 2018 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో కూడా సీపీఎం ఒంటిరిగా పోటీ చేసింది. 2014లో జరిగిన ఎన్నికల్లో సీపీఎంకు దాదాపు 6 వేల ఓట్లు వచ్చాయి. 2018 డిసెంబర్ లో రెండు వేల 100 ఓట్లు వచ్చాయి. సీపీఐ మాత్రం కాంగ్రెస్ కు మద్దతు ఇస్తూ వస్తోంది. ప్రస్తుతం టీఆర్ ఎస్ కు మద్దతు ఇస్తున్నట్లు సీపీఐ నాయకత్వం స్పష్టం చేసింది. 

హుజూర్ నగర్ లో సీపీఎం మద్దతు మాత్రం కీలకంగా మారింది. సంస్థాగతంగా సీపీఎం బలంగా ఉంది. పాలకవీడు, నేరేడుచెర్ల, గరిడే పల్లి మండలాల్లో సీపీఐ కంటే సీపీఎం ప్రభావం ఎక్కువగా ఉంది. గిరిజన బెల్టుల్లో కూడా సీపీఎంకు కొంత ప్రభావం ఉన్న పరిస్థితి ఉంది. మరో రెండు రోజుల్లో సీపీఎం ఎవరికి మద్దతిస్తుందన్న అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర కమిటీ నిర్ణయం కూడా రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉందని జిల్లా నేతలు చెబుతున్నారు.

ప్రస్తుతం హుజూర్ నగర్ బరిలో 31 మంది అభ్యర్థులు ఉన్నారు.  గురువారం (అక్టోబర్ 3, 2019)  ఉపసంహరణకు చివరి రోజు. (అక్టోబర్ 21, 2019)వ తేదీన హుజూర్ నగర్ ఉప ఎన్నికలు జరుగనున్నాయి. (అక్టోబర్ 24, 2019)వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. పోటీలో ఉన్న రాజకీయ పార్టీలు ఎవరికివారే గెలుస్తామనే ధీమాలో ఉన్నారు. ఉప ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.