ఎన్నికల అక్రమాలపై విచారణ: ఫిబ్రవరి 14కి వాయిదా 

  • Published By: chvmurthy ,Published On : January 30, 2019 / 04:44 PM IST
ఎన్నికల అక్రమాలపై విచారణ: ఫిబ్రవరి 14కి వాయిదా 

తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో అవకతవకలు, అక్రమాలు జరిగాయని దాఖలైన పిటిషన్ల ఫై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ఇబ్రహీంపట్నం అభ్యర్ధి మల్‌రెడ్డి రంగారెడ్డి వేసిన పిటిషన్ తో పాటు కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, ఎన్.ఉత్తమ్ పద్మావతి, ధర్మపురి లక్ష్మణ్ కుమార్ వేసిన పిటీషన్లను ఇంప్లీడ్ చేసి విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికల సంఘాన్ని కౌంటర్ ధాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 14 కు ధర్మాసనం వాయిదా వేసింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. గెలిచిన వారు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఓడిపొయిన వారు ఎలా ఓడిపోయామో లెక్కలు వేసుకుంటున్నారు. అప్పటి వరకు గెలుస్తామని ధీమాగా ఉండి, ప్రజలనాడి తమకే అనుకూలంగా ఉందని అనుకున్నా, ఊహించని రీతిలో భారీ మోజార్టీతో ప్రత్యర్ధులు గెలవడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎక్కడో అవకతవకలు జరిగాయని ఆరా తీశారు. అందుకు అనేక కారణాలు ఉన్నాయని, హైకోర్టు  న్యాయం చేస్తుందనే నమ్మకంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇప్పటికే 15 పిటీషన్లు ఎలక్షన్ కమిషన్ ను పార్టీలుగా చేస్తూ దాఖలు చేశారు. దీనిపై మొదటిగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి వేసిన పిటిషన్ తో పాటు కాంగ్రెస్ నేతలు వేసిన మూడు పిటషన్లను కంబైన్డ్ చేస్తూ హైకోర్టు విచారించింది.

తాము వేసిన పిటిషన్ల పై నేడు ఎన్నికల సంఘం కోర్టుకు తప్పడు వివరణలు ఇచ్చిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.  న్యాయవాది అరుణ్ వీవీ ప్యాట్లను మరోసారి లెక్కించాలని కోరినా ఎన్నికల సంఘం ఎందుకు అనుమతించడం లేదని వారు ప్రశ్నంచారు. ఎన్నికల సంఘం ఈరోజు కోర్టుకు ఇచ్చిన వివరణ కేవలం వీవీ ప్యాట్ల ప్రింట్ ఫార్మాట్ 5 సంవత్సరాల వరకు అలాగే ఉంటుందని మాత్రమే తెలిపింది. ఎన్నికల సంఘం ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని న్యాయస్థానం దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ ధాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

ఇబ్రహీంపట్నం నియోజక వర్గంలో టీఆర్ఎస్ అభ్యర్ధి మంచిరెడ్డి కిషన్ రెడ్డి 300 ఓట్ల మెజార్టీతో అక్రమంగా గెలుపొందారని, వీవీ ప్యాట్ల లెక్కింపులో తేడాలు జరిగాయని, మెుదట తాను గెలిచానని చెప్పి, తర్వాత తమ ప్రత్యర్ధి గెలిచారని ఎన్నికల అధికారులు లెక్కింపును తారుమారు చేశారని మల్ రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. పిటీషనర్ లేవనెత్తిన అంశాలను పరిగణలోకి తీసుకొని పూర్తి వివరాలతో ఈనెల 7 తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. వీవీ ప్యాట్ అవకతవకలపై మల్‌రెడ్డి రంగారెడ్డితో పాటు ఎన్.ఉత్తమ్ పద్మావతి, ధర్మపురి లక్ష్మణ్‌లు, అద్దంకి దయాకర్ కూడా పిటీషన్‌ దాఖలు చేశారు ఈ నాలుగు పిటీషన్లలో పేర్కొన్న అంశాలు ఒకటే కావడంతో ధర్మాసనం అన్నింటిని కలిపి విచారణ జరిపింది. 

పోలైన ఓట్ల కౌంటింగ్ కి, వీవీ ప్యాట్ మధ్య వ్యత్యాసాలు రావడంతో తమకి అనుమానం వచ్చి ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయిందని పిటిషనర్ మల్ రెడ్డి రంగా రెడ్డి అన్నారు. ఎలక్షన్ కమీషన్ ప్రభుత్వంకి బయపడాల్సిన అవసరం లేదని,స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేయాల్సిన అధికారులు ఇలా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఇలా చేయ్యడం సరైంది కాదని ఆయన అన్నారు. ఎలక్షన్ కమీషన్ కౌంటర్ దాఖలు చేసిన తరువాత వాటిని పరిశీలించి తమ తరుఫు న్యాయవాది వాదనలు వినిపిస్తాడని మల్ రెడ్డి తెలిపారు. మాకు వచ్చిన అనుమానాలు అన్నీ కోర్ట్ ముందు ఉంచామని, తెలంగాణ హైకోర్టులో న్యాయం జరగకపోతే అవసరమైతే సుప్రీ కోర్టును ఆశ్రయిస్తామని ఆయన చెప్పారు.

ఎన్నికల పిటిషన్లపై సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎలక్షన్ కేసులను 6 నెలల్లో తీర్పులు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో గెలుపొందిన వారు ఎన్నికల నిబంధనల్లో తప్పు చేస్తే అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కోర్టు ఈ పిటిషన్ లపై ఎలాంటి తీర్పు ఇస్తుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.