ఐటీ గ్రిడ్ వివాదం: జడ్జి ముందుకు ఆ నలుగురు

  • Published By: veegamteam ,Published On : March 4, 2019 / 05:15 AM IST
ఐటీ గ్రిడ్ వివాదం: జడ్జి ముందుకు ఆ నలుగురు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ప్రకంపనలు సృష్టించిన ఐటీ గ్రిడ్ కేసులో నలుగురు ఉద్యోగులను పోలీసులు హైకోర్టు జడ్డి ముందు ప్రవేశపెట్టారు. నలుగురు ఉద్యోగులను జడ్జి ఇంటికి  తీసుకెళ్లిన పోలీసులు ఆయన ముందు హాజరుపరిచారు. హైకోర్టు ఆదేశాలతో ఐటీ గ్రిడ్ ఉద్యోగులు భాస్కర్, ఫణి, విక్రమ్ గౌడ్, చంద్రశేఖర్‌లను పోలీసులు తీసుకొచ్చారు.

తమ ఉద్యోగులను  పోలీసులు అక్రమంగా నిర్భంధించారు అంటూ ఐటీ గ్రిడ్ సంస్థ డైరెక్టర్ అశోక్ హైకోర్టులో ఆదివారం(మార్చి 3) హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. నలుగురు ఉద్యోగులను వెంటనే కోర్టు ముందు  హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఆదివారం, సోమవారం హైకోర్టు సెలవులు ఉన్న నేపథ్యంలో జడ్జి ఇంట్లోనే విచారణ జరపాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌ను  విచారించిన హైకోర్టు.. సోమవారం పదిన్నర గంటలకు ఆ నలుగురిని హాజరుపరచాలని ఆదేశించింది.
Also Read : డేటా దొంగిలించి హైదరాబాద్ ఐటీ బ్రాండ్ పరువు తీశారు : లోకేష్

మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్ సంస్థ టీడీపీకి ఐటీ సేవలు అందిస్తుంది. ఈ ఆఫీస్‌లో ఏపీలోని ఓటర్ల డేటా దుర్వినియోగం అవుతోందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో సైబరాబాద్‌  పోలీసులు శనివారం(మార్చి 2) సాయంత్రం సోదాలు నిర్వహించారు. హార్డ్ డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ సంస్థ… టీడీపీకి  యాప్‌ తయారు చేసి ఇచ్చిందని, దీనిలో ఓటర్లు, వారి ఆధార్‌ కార్డుల  వివరాలతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమాచారం ఉందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు  చేశారు.

ఐటీ గ్రిడ్ కార్యాలయంలో తెలంగాణ పోలీసులు తనిఖీలు చేయడం కలకలం చేపింది. డేటా చోరీకి పాల్పడుతున్నారన్న సమాచారంతో తనిఖీలు చేసిన పోలీసులు నలుగురు ఉద్యోగులను   అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఐటీ గ్రిడ్‌లో పనిచేస్తున్న భాస్కర్ అనే ఉద్యోగి కనిపించడం లేదని యాజమాన్యం ఏపీలోని గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐటీ గ్రిడ్   యాజమాన్యం ఫిర్యాదుతో ఏపీ పోలీసులు భాస్కర్ కోసం హైదరాబాద్ చేరుకున్నారు. డేటా చోరీ కేసులో భాస్కర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలంగాణ పోలీసులు వారికి చెప్పారు.   అయితే భాస్కర్‌ను వెంటనే తమకు అప్పగించాలని ఏపీ పోలీసులు కోరారు. మరోవైపు ఐటీ గ్రిడ్ వ్యవస్థాపకుడు దాకవరపు అశోక్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఏపీకి సంబంధించి డేటా లీక్ కావడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. లీకేజీ వెనుక ఎవరున్నారన్న దారిపై దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీకి చెందిన ఎన్నో యాప్స్‌కు ఐటీ గ్రిడ్ సాంకేతిక సహకారం   అందిస్తోంది. సేవామిత్ర, మహానాడుతో పాటు టీడీపీ సభ్యత్వ నమోదు డేటాతో కూడిన హార్డ్ డిస్క్‌ను తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అది ఏపీకి చెందిన సమాచారం  కావడంతో మీరెలా చూస్తారు అని ఏపీ పోలీసులు వారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే కేసు తెలంగాణలో నమోదు కావడంతో పాటు తమ రాష్ట్ర సమాచారం కూడా చోరీకి గురైనట్లు   తెలియడంతో దీన్ని తామే విచారణ చేయిస్తామని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య వార్‌గా మారింది. ఇప్పటికే సీఎం   చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read : ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మంత్రి దేవినేని : అర్ధరాత్రి తోపుడు బండ్ల పంపిణీ