ఆ గట్టునుంటారా ఈ గట్టునుంటారా : జగన్‌తో కేటీఆర్ చర్చలు

  • Published By: veegamteam ,Published On : January 16, 2019 / 03:01 AM IST
ఆ గట్టునుంటారా ఈ గట్టునుంటారా : జగన్‌తో కేటీఆర్ చర్చలు

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. పొత్తులు, కూటమి ఎత్తులలాంటి పరిణామాలతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. బీజేపీ వ్యతిరేక  కూటమి ఏర్పాటే లక్ష్యంగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తుంటే.. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలను తెలంగాణ సీఎం కేసీఆర్ ముమ్మరం చేశారు. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలకు  వ్యతిరేకంగా లౌకిక కూటమి కోసం ప్రయత్నిస్తున్నారు. కలిసి వచ్చే అన్ని పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీతో చర్చించాలని కేసీఆర్ నిర్ణయించారు. వైసీపీ చీఫ్  జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరపాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ ఎంపీ వినోద్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డిని కేసీఆర్  ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాలతో… జగన్‌తో భేటీ కానున్నారు. తమతో కలిసి వచ్చే అంశంపై చర్చించనున్నారు.

2019, జనవరి 16వ తేదీ బుధవారం మధ్యాహ్నం తర్వాత కేటీఆర్.. జగన్ సమావేశం ఉండే అవకాశం కనిపిస్తోంది. ఫెడరల్ ఫ్రంట్‌తో కలవడంపైనే వీళ్ల సమావేశంలో ఫోకస్ పెట్టే అవకాశం ఉంది.  అయితే… కాంగ్రెస్, బీజేపీయేతర కూటమిపై జగన్‌ ఆసక్తి చూపిస్తున్నారా లేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు.. లోక్‌సభ ఎన్నికల్లోపు ఫెడరల్ ఫ్రంట్‌కు ఓ రూపం తేవాలని  భావిస్తున్న కేసీఆర్.. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌తో చర్చలు జరిపారు.   గతంలో ఉన్న యూపీఏ కూటమిలోగానీ, ప్రస్తుతం బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమిలో లేని వైసీపీ అధినేత జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. గతంలో  పలు సందర్భాలలో కేసీఆర్, జగన్‌ పరస్పరం ప్రశంసించుకున్న ఘటనలు ఉన్నాయి.

జగన్-కేసీఆర్ ఒక్కటవుతన్నారని ఇప్పటికే ఏపీలోని అధికార పార్టీ టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారంటూ టీడీపీ నేతలు  నిప్పులు చెరిగారు. అటు ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకొని చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కేసీఆర్ హెచ్చరించడం.. మరింత దుమారం రేపింది. ఆ వ్యాఖ్యలతో ఏపీ, తెలంగాణ నేతల మధ్య  తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఏసీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి టీఆర్ఎస్ మద్దతిస్తుందన్న ప్రచారమూ జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్, జగన్ భేటీ హాట్‌టాపిక్‌గా మారింది.  కేవలం ఫెడరల్ ఫ్రంట్‌పైనే చర్చిస్తారా? లేదంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా చర్చకు వస్తాయా? అన్నది తెలియాల్సి ఉంది.

కాగా, రెండోసారి తెలంగాణ సీఎం పగ్గాలు చేపట్టాక జాతీయ రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు కేసీఆర్. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం 2018, డిసెంబర్‌లో ఉత్తరాది రాష్ట్రాల్లో పర్యటించారు.  పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చలు జరిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఓసారి పలు పార్టీల అగ్ర నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు.  బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడ, సీఎం కుమారస్వామి, చెన్నైలో డీఎంకే నేత స్టాలిన్‌ను కలిసి చర్చలు జరిపారు. అయితే వీరిలో ఏ ఒక్కరూ కేసీఆర్‌కు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. కలిసి  వస్తామని చెప్పలేదు, కలవలేమని చెప్పలేదు. దాంతో కేసీఆర్ ప్రయత్నాలు ఏ మేర విజయవంతమవుతాయనేది హాట్‌టాపిక్‌గా మారింది.

జగన్‌-కేటీఆర్ భేటీపై టీడీపీ స్పందించింది. బీజేపీ డైరెక్షన్‌లో కేసీఆర్ పనిచేస్తుంటే, కేసీఆర్ డైరెక్షన్‌లో జగన్ పనిచేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. టీడీపీని దెబ్బతీసేందుకు ఇద్దరు  కూడబలుక్కుని రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.