జానారెడ్డికి గవర్నర్ పదవి..?

  • Published By: madhu ,Published On : December 13, 2020 / 08:33 AM IST
జానారెడ్డికి గవర్నర్ పదవి..?

Jana Reddy Governor Post : గవర్నర్ పదవి.. ఎంతోమంది తెలంగాణ నేతలను ఊరించిన పోస్ట్ ఇది. తాజాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. ఇంతకీ గవర్నర్‌ గిరీ ఆఫర్‌ ఎవరికి వచ్చింది. ఈ చర్చ ఎందుకు జరుగుతుంది. దుబ్బాక ఉప ఎన్నికలో అనూహ్య విజయం సాధించిన బీజేపీ.. నాగార్జునసాగర్‌లో పాగా వేయాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకోసం వేగంగా పావులు కదుపుతోంది. అక్కడ స్ట్రాంగ్‌ లీడర్‌గా ఉన్న జానారెడ్డిని బీజేపీలో చేర్చుకుని అతని కుమారుడు రఘువీర్‌రెడ్డిని బై ఎలక్షన్‌ బరిలోకి దింపాలని భావిస్తోంది. తెలంగాణలో బలమైన నేతకు గాలం వేయాలంటే చిన్నాచితక పదవులు సరిపోవుగా మరి.. అందుకే జానారెడ్డికి గవర్నర్ పదవి ఆఫర్‌ చేశారంటూ గుసగుసలు వినిపిస్తోన్నాయి. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియనప్పటికీ తెలంగాణకు గవర్నర్‌ గిరీ అనే చర్చ హాట్‌ టాపిక్‌గా మారింది.

ఎందుకో తెలీదుగానీ తెలంగాణ లీడర్లకు గవర్నర్‌ గిరీ చేయాలని ఆశ ఎక్కువ అంటున్నారు. వైఎస్‌ఆర్‌ హయాంలో కాంగ్రెస్‌ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు.. తనకు గవర్నర్‌గా పనిచేయాలని ఉందని పదేపదే చెప్పేవారు. కానీ పాపం ఎంఎస్‌ఆర్‌ రాజ్‌భవన్‌కు వెళ్లాలనుకుంటే కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ఆర్టీసీ చైర్మన్‌ పదవి ఇవ్వడంతో బస్‌ భవన్‌తో సరిపెట్టుకున్నారు.  అప్పట్లో ఎన్డీఏతో జతకట్టిన చంద్రబాబు తనను గవర్నర్‌ను చేస్తారని హామీ ఇచ్చారంటూ మోత్కుపల్లి నర్సింహులు పలుమార్లు మీడియా ముందే చెప్పారు. గవర్నర్ పదవి కోసం ఎదురు చూసీచూసీ.. ఇక టీడీపీలో ఉంటే గవర్నర్‌ పదవి దక్కదని.. బీజేపీలో చేరిపోయారు మోత్కుపల్లి. తాజాగా సాగర్ ఉప ఎన్నికతో గవర్నర్‌ అంశం తెరపైకి వచ్చింది.

తెలంగాణ నుంచి ఇప్పటికే చెన్నమనేని విద్యాసాగర్‌ రావు మహారాష్ట్ర గవర్నర్‌గా సేవలందించారు. ప్రస్తుతం బండారు దత్తాత్రేయ హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. వీళ్లలాగానే జానారెడ్డి కూడా గవర్నర్‌ పదవి చేపడుతారా ? తెలంగాణలో అధికారమే పరమావధిగా పని చేస్తోన్న బీజేపీ నిజ్జంగా జానారెడ్డిని రాజ్‌ భవన్‌కు పంపుతుందా ? ఏమో గుర్రం ఎగరా వచ్చు! జానారెడ్డి గవర్నర్‌ కానూ వచ్చు..